కేసీయార్ అనారోగ్యం.! సెంటిమెంటాస్త్రం.!

తెలంగాణ ముఖ్యమంత్రి, భారత్ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా కేసీయార్, ప్రత్యక్షంగా ఎక్కడా కనిపించడంలేదు. ఈ విషయమై, రాజకీయ ప్రత్యర్థుల నుంచి విమర్శలూ వస్తున్నాయి.

అయితే, కేసీయార్ స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారనీ, ఆయనే ఎన్నికల్లో తమ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ అనీ, భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ చెబుతున్నారు. ప్రస్తుతానికైతే మొత్తంగా ప్రచార బాధ్యతలన్నీ కేటీయార్ తన భుజాన మోస్తున్నారు. హరీష్ రావు, కవిత కూడా.. ప్రచార కార్యక్రమాల్లో బిజీగా వున్నారు.

ఇదిలా వుంటే, కేసీయార్ అనారోగ్య సమస్యని.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ ‘సెంటిమెంటాస్త్రం’గా వాడేందుకు గులాబీ పార్టీ ప్రయత్నిస్తోందన్న గుసగుసలు మీడియా, రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

గులాబీ పార్టీతో, ఐ-ప్యాక్ టీమ్ గతంలో కలిసి పని చేసింది. ఆ తర్వాత ఆ టీమ్‌, గులాబీ పార్టీకి దూరమయ్యిందనే ప్రచారమూ లేకపోలేదు. ఆ ఐ-ప్యాక్ సంస్థ సూచనల మేరకే, ఈ సెంటిమెంటాస్త్రం తెరపైకొచ్చిందన్నది ఓ వాదన. ఇందులో నిజమెంత.? అన్నది ముందు ముందు తేలుతుంది.

పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ, వీల్ ఛెయిర్ మీదనే క్యాంపెయిన్ చేసిన సంగతి తెలిసిందే. ఐ-ప్యాక్ వ్యూహాలు ఇలాగే వుంటాయ్. చాలా సందర్భాల్లో అవి సత్ఫలితాలనిచ్చాయి కూడా.

అయితే, ఈ నెల 15 నుంచి ఉధృతంగా కేసీయార్, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని గులాబీ పార్టీ నేతలు కుండబద్దలుగొట్టి మరీ చెబుతున్నారు.