కవిత అరెస్టుపై కేసీఆర్ క్లారిటీ…!

ఇటు తెలంగాణలోనూ, అటు జాతీయ స్థాయిలోనూ ప్రస్తుతం రాజకీయం అంతా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు చుట్టునే తిరుగుతుంది. ఈ కేసు విషయలో ఇప్పటికే పదిమందిని అరెస్టు చేసిన దర్యాప్తు సంస్థలు.. తాజాగా మరింత దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం కవితను కీలక విచారణ చేస్తుంది ఈడీ. ఈ సందర్భంగా కవిత అరెస్టుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి!

తాజాగా జరిగిన బీఆరెస్స్ మీటింగులో తన కుమార్తే కేసు విషయంపై కేసీఆర్ స్పందించారు. కవిత అరెస్టు వార్తలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. “కవితను ఈడీ అరెస్టు చేయవచ్చు..” అంటూ అనుమానం వ్యక్తం చేసిన కేసీఆర్… “మంత్రులను వేధించారు.. ఎంపీలను వేదించారు.. మరికొందరు పార్టీ నేతలను వేధించారు.. ఇప్పుడు నా బిడ్డ వరకూ వచ్చారు.. మహా అయితే కవితను అరెస్టు చేస్తారు.. జైలుకు పంపిస్తారు.. అంతేకదా! ఏం చేస్తారో చూద్దాం.. ఎవరికీ భయపడేది లేదు.. ఎంతమందిని అరెస్టు చేస్తారో చేసుకోనివ్వండి” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత అరెస్టుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బీఆరెస్స్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

ఇదే క్రమంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలపై విరుచుకుపడిన కేసీఆర్… వచ్చే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేద్దమని, అందుకు అంతా కలిసికట్టుగా కష్టపడి పనిచేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎంత మంచిగా పనిచేసినా బద్నం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆయన… దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలను ఆకర్షిస్తున్నాయని, తమ పార్టీ చేతగానితనం ఇతర రాష్ట్రాల్లో బయటపడుతుందనే అక్కసుతో బీజేపీ కక్షసాధింపునకు పాల్పడుతోందని కేసీఆర్ ఆరోపించారు.

కేసీఆర్ వ్యాఖ్యలు ఇలా ఉంటే… మరోవైపు కేటీఆర్ – హరీష్ లు హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారు. దీంతో కేసీఆర్ వ్యాఖ్యలకు మరింత బలం చేకూరింది. దీంతో.. కవిత అరెస్టు విషయంలో ఆయనకు హస్తిన నుంచి పక్కా సమాచారం ఉండి ఉండొచ్చని, అందుకే అంత క్లియర్ గా స్పందించి ఉండొచ్చని అంటున్నారు విశ్లేషకులు!