ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు వినిపిస్తుండటం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. కవిత ఏ తప్పు చేయకుండా ఆమె పేరు ఎందుకు ప్రస్తావనకు వస్తుందని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అయితే కవిత మాత్రం తనకు నోటీసులు అందినా ఎఫ్.ఐ.ఆర్ లో పేరు లేదు కాబట్టి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తన పాత్ర లేనట్టేనని చెబుతున్నారు. నిందితుల జాబితాలో పేరు లేకపోవడంతో ఈరోజు సీబీఐ అధికారులను నేను కలవనని ఆమె అన్నారు.
ముందే ఖరారైన కొన్ని కార్యక్రమాల వల్ల సీబీఐ అధికారులను కలవడం సాధ్యం కాదని ఆమె చెప్పుకొచ్చారు. అయితే కవిత ఈ విధంగా ఆలస్యం చెయ్యడం వల్ల పార్టీకే నష్టమని కొంతమంది నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఎఫ్.ఐ.ఆర్ లో పేరు లేదు సరే ఆ కుంభకోణంలో పాత్ర ఉందా లేదా చెప్పాలంటూ కొందరు నెటిజన్లు కవితను ప్రశ్నిస్తున్నారు. సీబీఐ అధికారులను కలిసి తాను తప్పు చేయలేదని కవిత ప్రూవ్ చేసుకుని ఉంటే బాగుండేదని మరి కొందరు వెల్లడిస్తున్నారు.
తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని దర్యాప్తుకు సహకరిస్తానని చెబుతున్న కవిత ఈ విధంగా వ్యవహరించడం సరికాదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే కవితను అధికారులు అరెస్ట్ చేస్తే మాత్రం కేసీఆర్ సర్కార్ పరువు పోతుందని కామెంట్లు వ్యక్తమయ్యాయి. బీజేపీ ఈ కేసులో కవితను నిందితురాలిని చేశారని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో టీ.ఆర్.ఎస్ పార్టీని ఓడించడం కోసం బీజేపీ అన్ని అవకాశాలను వినియోగించుకుంటోంది. న్యాయ నిపుణుల సూచనలను బట్టి కవిత నిర్ణయాలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. ఈ కేసులో రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.