కవితకి అరెస్టు భయమా.? పబ్లిసిటీ స్టంట్లేనా.?

ముఖ్యమంత్రి కుమార్తె ఆమె.! పైగా ఎమ్మెల్సీ కూడా.! జాతీయ పార్టీగా అవతరించిన భారత్ రాష్ట్ర సమితిలో ఆమె కీలక నేత కూడా. మరీ నీఛంగా లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కోవడమేంటి.? ఈ చర్చ జనబాహుళ్యంలో జరుగుతోంది. ఈ లిక్కర్ ఆరోపణల బురదని కడుక్కోవడం కవితకి అంత ఈజీ కాదు.! గులాబీ పార్టీ అధినేత కేసీయార్ కుమార్తె కవిత వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. లిక్కర్ స్కామ్‌లో ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారామె.

తాజాగా ఆమె ఇంకోసారి ఢిల్లీకి పయనమయ్యారు.. ఈడీ యెదుట విచారణకు హాజరవుతారు. ఈ క్రమంలో పలువురు గులాబీ పార్టీ నేతలు ఆమె వెంట ఢిల్లీకి వెళ్ళారు. అలా కవిత వెంట ఢిల్లీకి వెళ్ళినవారిలో పలువురు మంత్రులు కూడా వున్నారు. ఇదెక్కడి వింత.? అసలు మంత్రులకు ఢిల్లీలో కవిత కేసుతో పనేంటి.? అన్న ప్రశ్న సహజంగానే తెరపైకొస్తుంది. ఎవరి గోల వారిది. కవితలో అరెస్టు భయం కనిపిస్తోంది. అబ్బే, అదేం లేదని గులాబీ పార్టీ బుకాయిస్తోందనుకోండి.. అది వేరే వ్యవహారం.

కవిత అరెస్టవుతారా.? లేదంటే, ఇదంతా కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనా.? ఏమో, అరెస్టు అవనూవచ్చు. అవకపోనూవచ్చు. అరెస్టయితే, ఇంకాస్త గట్టిగా రంకెలేయొచ్చు. అరెస్టు జరగకపోతే, మీసం మెలేయొచ్చు కూడా.! ఇదీ గులాబీ పార్టీ వ్యూహం. అయితే, గులాబీ పార్టీ పరువు పోయిందన్న విషయాన్ని మాత్రం ఆ పార్టీ నేతలు తెలుసుకోలేకపోతున్నారు.

ఔను మరి, లిక్కర్ స్కామ్‌లో మహిళా నేతపై ఆరోపణలు రావడమేంటి.? ఏం, స్కామ్‌లలో మగాళ్ళకు మాత్రమే పాత్ర వుండాలా.? ఆడాళ్ళకు వుండకూడదా.? అని ప్రశ్నిస్తే ఏం చేయగలం.?1 ఏదో జరుగుతోంది.. అసలేం జరగోబోతందన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.