Jeevan Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్సీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి బిజెపి వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఏడాదిలోపే అన్ని పథకాలను అమలు పరుస్తూ అద్భుతమైన పాలన అందిస్తుంది. ఈ క్రమంలోనే ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తుంటే వాటిని చూసి బిజెపి ఓర్వలేక పోతుందని జీవన్ రెడ్డి మాట్లాడారు.
బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా ఉచిత బస్ రవాణా ఇస్తున్నారా?.. రైతు రుణాలు మాఫీ చేశారా?.. ఎంఎస్పీ ఇవ్వాల్సిన మీరు.. చట్టబద్దత కల్పించడం లేదు అని ప్రశ్నించారు. కానీ మేము వరి బోనస్ ఇచ్చి కొంటున్నామన్నారు. ఇలా ఇన్ని చేసిన మమ్మల్ని ఏమీ చేయని బిజెపి వారు కూడా ప్రశ్నిస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుందని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా కోటి మందికి ఉచిత విద్యుత్ అలాగే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.
ఇక, మా మీద చార్జిషీట్ కాదు.. బీజేపీ వాళ్లు ఇచ్చిన హామీలపై ప్రాసిక్యూట్ చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఇలా మాపై విమర్శలు చేయకుండా ఒక్కసారిగా మీరే ఆత్మ విమర్శ చేసుకోవాలని తెలిపారు.20 వేల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసింది వాస్తవం కదా..? హరీష్ రావు.. మీరు చేసింది ఎంత..? అని అడిగారు. నువ్వు చేసిన మాఫీ వడ్డీకే సరిపోయింది.. సన్న రకాల వడ్లకు బోనస్ ఇవ్వడం వల్ల రైతులకే మరింత లాభమని జీవన్ రెడ్డి తెలిపారు.
ఇలా ఏడాది కాలంలో తాము అద్భుతమైన పాలన అందజేశామని ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలుచేసి మాట నిలబెట్టుకున్నామని కాంగ్రెస్ నాయకులు మంత్రులు ఎమ్మెల్సీలు చెబుతున్నారు కానీ బిజెపి, బిఆర్ఎస్ నాయకులు మాత్రం ఇచ్చిన మాట తప్పారని అబద్ధాలు చెప్పడంలో రేవంత్ రెడ్డి అందరిని మించిపోయారు అంటూ తెలంగాణ సర్కారుపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.