ఉమ్మడి రాష్ట్రంలోనే ఉపముఖ్యమంత్రి.. తెలంగాణలో డైనమిక్ లీడర్.. మెదక్ లో మాస్ లీడర్ గా దామోదర రాజనర్సింహ్మకు పేరుంది. కానీ తెలంగాణ కోసం ఉపముఖ్యమంత్రి హోదాలో ఆయన చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. కేంద్రాన్ని ఒప్పించే క్రమంలో ఆయన తెలంగాణవాదులకు వారధిగా పనిచేశారు. తెలంగాణ సాధనలో తనవంతు పాత్ర పోశించారు. కానీ తెలంగాణ ఉద్యమ నేతగా కేసిఆర్ చెప్పిన వ్యక్తికే 2014లో ఓట్లేసి ఆంధోల్ లో గెలిపించారు. సినీ నటుడు బాబుమోహన్ గెలిచారు.. దామోదర రాజనర్సింహ్మ ఓటమిపాలయ్యారు. ఇక ఇప్పుడు 2019 సీన్ ఎలా ఉంటుంది? ఏం జరగబోతున్నది. దామోదర్ కాంగ్రెస్ లోనే కొనసాగుతారా? లేక కారేక్కేస్తారా? చదవండి హాట్ స్టోరీ.
ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ్మ టిఆర్ఎస్ లో చేరతారంటూ గత కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచార తీవ్రత జిల్లా స్థాయిని దాటి రాష్ట్ర స్థాయికి మారింది. అయితే ఆయన టిఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఇప్పటి వరకు ఎక్కడా ప్రకటించలేదు. అలాగని జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఖండించలేదు. దీంతో రాజకీయ వర్గాల్లో ఈ ప్రచారానికి బలం చేకూరుతోంది. 2019 ఎన్నికల్లో దామోదర రాజనర్సింహ్మ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారోనని కేడర్ లో కూడా ఆసక్తి నెలకొంది. మెదక్ జిల్లా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చల సరళి చూస్తే.. దామోదర రాజనర్సింహ్మ రానున్న ఎన్నికల నాటికి కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ లో చేరే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. దామోదర కు నాలుగు లేదా ఐదు టికెట్లు ఇస్తే కారెక్కే చాన్స్ ఉందంటున్నారు. అలా కాకపోతే మూడు సీట్లైనా ఇస్తామంటే టిఆర్ఎస్ లో చేరవచ్చని చెబుతున్నారు. ఎందుకంటే దామోదరకు టిఆర్ఎస్ పార్టీ అవసరం ఏమాత్రం లేదని, దామోదర అవసరమే టిఆర్ఎస్ కు ఉండొచ్చని ఆయన సన్నిహితుల నుంచి వస్తున్న మాట. ఆయన తీసుకునే నాలుగు సీట్లలో ఆంధోల్ లో ఆయనకు ఒక టికెట్ కాగా తన కూతురు త్రిష కు జహీరాబాద్ ఎమ్మెల్యే సీటు, అలాగే జహీరాబాద్ ఎంపి కానీ, సంగారెడ్డి అసెంబ్లీ సీటు కానీ తన సతీమణి పద్మినీరెడ్డి బరిలోకి దిగుతారని చెబుతున్నారు. ఇక నాలుగో సీటుగా దామోదరకు అత్యంత సన్నిహితుడైన మాజీ ఎంపి సురేష్ షెట్కార్ కోసం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. దాంతోపాటు వికారాబాద్ లో తన అనుచరుడైన మాజీ మంత్రి ప్రసాద్ కు కూడా టికెట్ తీసుకోవచ్చని అంటున్నారు. సురేష్ షెట్కార్ కు జహీరాబాద్ ఎంపి లేదా, నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ సీటు కోరవచ్చని అంటున్నారు. అయితే నాలుగు సీట్లు ఇవ్వలేని పరిస్థితి ఉంటే కనీసం మూడు సీట్లు పక్కాగా ఇస్తేనే దామోదర కారెక్కవచ్చంటున్నారు.
దామోదర రాజనర్సింహ్మ కారెక్కే పరిస్థితే ఉంటే ఉమ్మడి మెదక్ జిల్లా సీన్ మారిపోయే చాన్స్ ఉందంటున్నారు. ఆయనతోపాటు మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి కూడా కారెక్కినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెబుతున్నారు. అయితే సునీతాలక్ష్మారెడ్డి ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి ఆలోచన చేయలేదని అంటున్నారు. దామోదరకు నాలుగు సీట్లతోపాటు ఒక మంత్రి పదవి కూడా కోరే చాన్స్ ఉండొచ్చని చెబుతున్నారు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలోనే దామోదర ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే సునీతాలక్ష్మారెడ్డి కూడా ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. ఆమె కూడా తనకు మంత్రి పదవి ఇస్తామని టిఆర్ఎస్ హామీ ఇస్తే పార్టీ మారే విషయంలో ఆలోచన చేయవచ్చని చెబుతున్నారు. అయితే ఈ ఇద్దరు నేతలకు టిఆర్ఎస్ ఎప్పటినుంచో తలుపులు బార్లా తీసి పెట్టిందని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. వీరు ఎప్పుడు వచ్చినా చేర్చుకునే చాన్స్ ఉందంటున్నారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలోనే హేమాహేమీలుగా ఉన్న వీరికి తగిన గౌరవం దక్కుతుందని నమ్మితేనే పార్టీ మారవచ్చని అంటున్నారు. దామోదరకు సునీతాలక్ష్మారెడ్డికి సత్సంబంధాలే ఉన్నాయి. కానీ దామోదర కు మాజీ మంత్రి జహీరాబాద్ ఎమ్మెల్యే జె.గీతారెడ్డికి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఉంది. అందుకోసమే పార్టీ మారుడంటూ జరిగితే గీతారెడ్డి మీద తన కూతురు కోసం దామోదర కచ్చితంగా సీటు అడిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
దామోదరకు సిఎం కేసిఆర్ వ్యవహార శైలి అంటే ముందునుంచీ నచ్చదన్న ప్రచారం కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో దామోదర కారెక్కే చాన్స్ ఉండకపోవచ్చన్న వాదన కూడా ఉంది. కేసిఆర్ శైలి నచ్చకుండా ఆ పార్టీలో చేరితే ప్రయోజనం ఉంటుందా అన్న కోణంలోనూ సమాలోచనలు చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే మంత్రి హరీష్ రావు తో దామోదరకు సత్సంబంధాలు ఉండడం కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు.
సంగారెడ్డిలో గట్టి పట్టున్న పద్మినీరెడ్డి
దామోదర రాజనర్సింహ్మ సతీమణి పద్మినీరెడ్డికి సంగారెడ్డిలో మంచి పట్టుంది. గత ఎన్నికల్లోనే ఆమెకు టికెట్ వచ్చే అవకాశాలున్నయన్న చర్చ సాగింది. కానీ జగ్గారెడ్డికి ఆ సీటు దక్కినా ఉద్యమ వేడిలో ఆయన ఓటమిపాలయ్యారు. ఇక పద్మినీ రెడ్డి పార్టీ మారితే టిఆర్ఎస్ నుంచి సంగారెడ్డిలో జగ్గారెడ్డి మీదే పోటీ చేసే చాన్స్ ఉందంటున్నారు. సంగారెడ్డి పరిసరాల్లో వైకుంఠపురం అనే పెద్ద దేవాలయాన్ని తన సొంత డబ్బుతో పద్మినీరెడ్డి నిర్మించినట్లు చెబుతున్నారు. అక్కడ వారానికి ఒకసారి ఆమె వెళ్లి పూజలు చేస్తారు. ఆ దేవాలయానికి సంగారెడ్డి పట్టణంలో 30 నుంచి 40 శాతం మంది భక్తులు ఉన్నట్లు చెబుతారు. వారంతా ఆ దేవాలయానికి వచ్చి పూజలు చేసుకుంటారు. అంతేకాకుండా ఆమె రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆ వర్గాలు కూడా ఆమెను ఆదరించే అవకాశం ఉంటుందని, దామోదర మాజీ ఉపముఖ్యమంత్రిగా సంగారెడ్డిలో మంచి ఫాలోయింగ్ కలిగి ఉన్నట్లు చెబుతున్నారు. ఈ అవకాశాలన్ని అందిపుచ్చుకుంటే సంగారెడ్డిలో పద్మినీరెడ్డి గెలుపు సునాయాసం అని వారు అంచనాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా దామోదర నోరు విప్పితేనే కానీ పార్టీ మార్పుపై మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.