కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబునాయుడు పొత్తు పెట్టుకోవటాన్ని ఇష్టపడని పలువురు సీనియర్ నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. రెండు రోజులుగా కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చంద్రబాబునాయుడుకు షాక్ తప్పేట్లు లేదు. రాష్ట్రస్ధాయిలోని నేతల మనోభావాలతో సంబంధం లేకుండా నేరుగా ఏఐసిసి అధ్యక్షుడు రాహూల్ గాంధితో కనెక్షన్ పెట్టసుకున్నారు. తెలంగాణాలో కెసియార్ కామన్ శతృవున్న ఏకైక కారణాన్ని చూపించి అటు తెలంగాణాలో ఇటు ఏపిలో కూడా చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తులు పెట్టేసుకున్నారు. పొత్తులైతే పెట్టుకున్నారు కానీ నేతలతో కలిసి పనిచేసేదెలా ? ఇపుడిదే పెద్ద సమస్యగా మారింది చంద్రబాబుకు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో పొత్తులు అంత సానుకూలమయ్యేట్లు కనబడటం లేదు.
ఎందుకంటే, కాంగ్రెస్, టిడిపిల పొత్తు కుదరి మూడు రోజులైనా ఇప్పటి వరకూ కాంగ్రెస్ నేతల నుండి చంద్రబాబుకు స్వాగతం కానీ పొత్తులపై హర్షం కానీ లభించలేదు. కనీసం ఏపి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా పొత్తులపై సానుకూలంగా స్పందిస్తూ ఒక్క ప్రకటన కూడా చేయకపోవటం గమనార్హం. అదే సమయంలో తెలుగుదేశంపార్టీ నుండి కూడా ఒక్క పాజిటివ్ స్టేట్ మెంట్ కూడా రాలేదు. పైగా నేతల్లో రివర్స్ యాక్షన్ కనబడుతోంది. పొత్తులు కుదిరినట్లు ఢిల్లీ నుండి అధికారికంగా ప్రకటన రాగానే మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత వట్టి వసంతకుమార్ రాజీనామా చేశారు.
రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల్లో నేలమట్టమైనా వట్టి పార్టీని వదల్లేదు. అటువంటిది టిడిపితో పొత్తనగానే రాజీనామా చేశారు. ఇక, వట్టి దారిలోనే మరో మాజీ మంత్రి శ్రీ రామచంద్రయ్య కూడా రాజీనామాకు సిద్ధపడినట్లు సమాచారం. రోజులు గడిచేకొద్దీ ఇంకెంతమంది సీనియర్లు బయటకు వెళ్ళిపోతారో తెలీదు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చంద్రబాబుతో పొత్తలు పెట్టుకోవటాన్ని చాలామంది నేతలు జీర్ణించుకోలోక పోతున్నట్లు అర్ధమైపోతోంది. సమయం, సందర్భం చూసుకుని అందరూ బయటపడతారేమో ?
ఇక, టిడిపి విషయానికి వస్తే ఇక్కడ కూడా ఒక్క నేత కూడా కాంగ్రెస్ తో పొత్తును హర్షించటం లేదు. పైగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ తో పొత్తుల విషయంలో మంత్రులు కెఇ కృష్ణమూర్తి, చింతకాయల అయ్యన్నపాత్రుడు గతంలో చేసిన ప్రకటనలే సాక్ష్యాలు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ఉరేసుకుంటానని కెఇ, మమ్మల్ని జనాలు బట్టలూడదీసి కొడతారని చింతకాయల చెప్పిన మాటలు అందరికీ గుర్తుండే ఉంటుంది.
మరి, ఇపుడు కెఇ ఉరేసుకుంటారా, చింతకాయల తన దగ్గర అదనంగా నాలుగు జతల బట్టలు పెట్టుకుంటారా అన్నది వేరే విషయం. పొత్తులు పెట్టుకునే సమయంలో ఢిల్లీలో చంద్రబాబుతో పాటు వెంటున్న మంత్రులు కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు కూడా రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత ఒక్క ప్రకటన కూడా ఇవ్వకపోవటం గమనార్హం.