తెలుగు రాష్ట్రాలలో ఆన్లైన్ లోన్ అప్స్ సంబంధించిన వ్యవహారం రోజు రోజుకి హాట్ టాపిక్ గా మారుతుంది. వీటి వలన అనేక మంది ప్రజలు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుండగా మరికొందరు ప్రాణాలు తీసుకునేందుకు సిద్దమవుతున్నారు. దీంతో ఈ లోన్ యాప్‌ల నిర్వాహకులపై పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. తాజాగా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.చైనా దేశస్థుడు ‘లాంబో’తో పాటు కర్నూలుకు చెందిన నాగరాజును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో వారిద్దరినీ అరెస్ట్ చేశారు.
ఈ యాప్‌ల ద్వారా లాంబో ఏకంగా 1.4 కోట్ల మందికి రూ. 21 వేల కోట్ల రుణాలు ఇచ్చినట్లు ప్రాథమికంగా తేల్చారు. లాంబోకు చెందిన కంపెనీ కాల్ సెంటర్లలో నాగరాజుదే కీలక పాత్ర అని తెలుసుకున్నారు పోలీసులు. ఢిల్లీ కేంద్రంగా యాప్‌ల కార్యకలాపాలు నిర్వహిస్తున్న లాంబో.. ఢిల్లీ నుంచి షాంఘై వెళ్లే విమానం ఎక్కే క్రమంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ రమేష్ అతడిని అదుపులోకి తీసుకున్నారు. లాంబో, నాగరాజులను హైదరాబాద్ తీసుకొచ్చి విచారిస్తున్నారు.కాగా, డిసెంబర్ 22 గుర్గావ్‌లోని రెండు కాల్ సెంటర్లలో పోలీసులు తనిఖీలు చేస్తున్నట్లు తెలుసుకున్న లాంబో.. ఢిల్లీ, నోయిడాలో కొనసాగుతున్న నాలుగు కాల్ సెంటర్లను వెంటనే మూసివేయించాడు. ఆ తర్వాత నాగరాజుతో కలిసి తప్పించుకు తిరుగుతున్నాడు.
ఈ క్రమంలో లాంబోను పట్టుకుంటే ఈ లోన్ యాప్ రాకెట్ గుట్టు తెలుస్తుందని భావించిన పోలీసులు… అతడి కదలికలపై నిఘా పెట్టి పట్టుకున్నారు. ఇంతకుముందు ఢిల్లీలో అరెస్టైన రమణ్‌దీప్ సింగ్, చైనా కంపెనీ డైరెక్టర్ ప్రభాకర్ దంగ్వాల్‌ను విచారించి లాంబోకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టారు. కాగా, ఈ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో బాధితులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటి వరకు 27 కేసుల్లో 16 మంది నిందితులను అరెస్ట్ చేశారు.