బ్రేకింగ్ న్యూస్… హైదరాబాద్ మెట్రో తొలి తప్పిదం

హైదరాబాద్ లో మెట్రో రైలు సాంకేతిక కారణాలతో నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మియాపూర్-అమీర్ పేట్ మార్గంలో మెట్రో సేవలు నిలిచిపోయాయి. ఉదయం 10 గంటలకు అమీర్ పేట నుంచి మియాపూర్ వెళ్తున్న రైలు సాంకేతిక లోపంతో బాలానగర్ స్టేషన్ ప్రాంతంలో నిలిచిపోయింది.

దీంతో రైలు పట్టాలపై నిలిచి పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అసలే ఆఫీసులకు సమయం కావడంతో అంతా ఆందోళన వ్యక్తం చేశారు. మెట్రో పవర్ ప్లాంట్ లో ఇబ్బంది రావడంతో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పట్టాలపై రైలు నిలిచి పోవడంతో అక్కడ సర్వీసులన్నీ బంద్ అయ్యాయి.

రైలు నిలిచి పోయిన విషయం మెట్రో ప్రయాణికులకు తెలపకుండా సిబ్బంది టికెట్లు ఇచ్చారు. ఎంత సేపు వేచి చూసినా రైలు రాకపోవడంతో ప్రయాణికులు సిబ్బందిని నిలదీశారు. దీంతో చావు కబురు సల్లగా చెప్పినట్టు అసలు సమస్య చెప్పారు. దీంతో ప్రయాణికులు ఆందోళన చేశారు. తమ డబ్బులు వాపస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్లాంట్ లో పనులు చేస్తున్నామని త్వరగనే రైళ్ల పునరుద్దరణ జరుగుతుందని మెట్రో సిబ్బంది తెలిపారు. అయినా కూడా ప్రయాణికులు శాంతించలేదు. తమ డబ్బు వాపస్ ఇవ్వాలని మెట్రో కౌంటర్ల దగ్గర లొల్లి చేశారు. మెట్రో సిబ్బంది మాత్రం తమకేమి పట్టనట్టు వ్యవహారిస్తున్నారు. విద్యార్దులు, ఆఫీసులకు పోయేవాళ్లు అధికంగా ఉన్నారు. దసరా సెలవులు కావున ఊళ్లకు వెళ్లే వాళ్లు కూడా తమ సామాన్లతో ఇబ్బంది పడ్డారు. అధికారులు మాత్రం ఏం తెలియనట్టుగా ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా వ్యవహారిస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.