హైదరాబాద్ ట్రాఫిక్ బాధితులకు శుభవార్త…

ఇక ఎల్ బి నగర్ నుంచి ఝామ్మని మెట్రోలో వెళ్లవచ్చు…

ప్రతిష్టాత్మకమయిన హైదరాబాద్ మెట్రో రెండో రూట్  అమీర్‌పేట్‌- ఎల్‌బీనగర్‌  ఈ రోజు ప్రారంభమయింది.  తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఇఎస్ ఎల్  నరసింహన్‌ పచ్చజెండా ఊపి మెట్రో రైలు ను ప్రారంభించారు.ఇది  కారిడార్‌ వన్‌ లోకి వస్తుంది. ఇందులో మియాపూర్‌ నుంచి ఎల్‌ బీ నగర్‌ వరకు మొత్తం 29 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నడుస్తుంది.

 

ఈ సాయంత్రం 6 గంటల నుంచి ప్రయాణీకులకు మెట్రో రైలులో ప్రయాణించేందుకు అనుమతి ఉంటుంది. ఈ కార్య  క్రమంలో  మంత్రులు, కేటీఆర్‌, నాయిని, తలసాని, బిజెపి ఎంపి బండారు దత్తాత్రేయ ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

 ఈ మార్గం ప్రారంభం కావడంతో   ఢిల్లీ తర్వాత దేశంలోనే రెండో పెద్ద మెట్రోగా హైదరాబాద్ మెట్రో అవతరించింది. నగరంలో అత్యంత రద్దీ  ఉండే రోడ్ ఎల్ బి నగర్- మియాపూర్. ఈ మార్గంలో ఇపుడు మెట్రో సేవలు అందుబాటులోకి రావడంతో ప్రయాణికుల   ట్రాఫిక్‌ కష్టాలు చాలావరకు తీరతాయి.  మెట్రో రైలెక్కితే  మియాపూర్‌ నుంచి ఎల్‌బీనగర్‌ వరకు కేవలం 50 నిముషాల్లోనే చేరుకోవచ్చు. ఈ రోజు ప్రారంభమయిన ఎల్ బి నగర్ -అమీర్ పేట మార్గంలో మొత్తం 17 స్టేషన్లున్నాయి. ఎంజీబీఎస్‌ మెట్రో స్టేషన్‌ ఆసియాలో అతిపెద్ద ఇంటర్‌ ఛేంజ్‌ స్టేషన్‌గా మారుతుంది.