Hebba Patel: హెబ్బా పటేల్ ఫోన్ ట్యాప్ అయింది.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

Hebba Patel

Phone Tapping case: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖులు, జడ్జిలు, మీడియా అధిపతులు, ఇలా అనేక మంది ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. దాదాపు 600 మందికి పైగా ఫోన్లు ట్యాప్ అయినట్లు భావిస్తున్నారు. 2018 ఎన్నికల నుంచే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు తేల్చారు. దుబ్బాక ఉప ఎన్నిక, హుజురాబాద్ ఉప ఎన్నిక, మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీల నాయకులు, కార్యకర్తలు ఫోన్లు ట్యాప్ చేసి నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపించారు. అలాగే 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కీలక నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు గుర్తించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అంశంపై సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సిట్ అధికారులు టాస్క్ ఫోర్స్ సీఐ ప్రణీత్ రావు, డీఎస్పీ రాధాకిషన్ రావు, ఇతర పోలీస్ అధికారులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారు బెయిల్‌పై బయట ఉన్నారు. అయితే ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోయారు. ఎట్టకేలకు ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణకు హాజరయ్యారు. ఇప్పటివరకు ఆరు సార్లు ప్రభాకర్ రావును అధికారులు విచారించారు. కానీ విచారణలో ప్రభాకర్ రావు సమాధానాలు చెప్పడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు.

ఇదిలా ఉంటే తమ ఫోన్ ట్యాప్ అయినట్లు భావిస్తున్న టీపీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్, బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు తదితర నేతలు సిట్ విచారణకు హాజరై తమ వాంగ్మూలం ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్ కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని వారు ఆరోపించారు. దేశ చరిత్రలోనే అతి పెద్ద నేరంగా ఉన్న ఫోన్ ట్యాపింగ్ వెనక ఉన్న అసలు నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చివరకు సినిమా హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసి వారి సంసారాలను నాశనం చేశారని మహేశ్ కుమార్ రెడ్డి ఆరోపణలు చేశారు.

తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి కూడా సంచలన ఆరోపణలు చేశారు. హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, హెబ్బా పటేల్ ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు. వాళ్ల ఫోన్లు ట్యాప్ చేయడానికి వారు ఏమైనా మహిళా మావోయిస్టులా అని ప్రశ్నించారు. భార్యాభర్తల పర్సనల్ ఫోన్ కాల్స్ వినడం దారుణమన్నారు. యూనిఫామ్‌కు విలువ లేకుండా కొంతమంది పోలీసులు అధికారులు వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. రేవంత్ ప్రభుత్వం ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం అసలు నిందితులను అరెస్ట్ చేయకుండా ఆడియోలు వింటూ బ్లాక్ మెయిల్ దందాలు చేస్తారని ఫైర్ అయ్యారు.