ఆంధ్రోళ్ళూ.. తెలంగాణకి వచ్చెయ్యండి: హరీష్ రావు

ఇంతలోనే ఎంత మార్పు.? ‘ఆంధ్రోళ్ళూ.. తెలంగాణకు వచ్చేయండి.. ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు ఎలా వున్నాయో చూస్తున్నారు కదా.? తెలంగాణలో వుంటున్న ఆంధ్రోళ్ళు.. ఆంధ్రప్రదేశ్‌లో ఓటు హక్కు రద్దు చేసుకుని, తెలంగాణలో ఓటు హక్కు నమోదు చేసుకోండి..’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి హరీష్ రావు.

భారత్ రాష్ట్ర సమితి నేత హరీష్ రావుకి, పాత రోజులు గుర్తులేవేమో.! ఓ సారి ఇంటర్నెట్‌లో వెతికితే, ఆంధ్రోళ్ళపై ఆయన సహా చాలామంది తెలంగాణ నాయకులు చేసిన విమర్శలు, దాడులకు సంబంధించిన వీడియోలు దొరుకుతాయి. సరే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక, ఈ విషయమై ఎక్కడా వివక్ష లేదనుకోండి.. అది వేరే సంగతి.

ఓ వ్యక్తి ఎక్కడ స్థిరపడాలి.? ఎక్కడ ఓటు హక్కు కలిగి వుండాలన్నది.. వారి వారి ఇష్టాల్ని బట్టి వుంటుంది. తెలంగాణలో ఇప్పటికే చాలామంది ఆంధ్రోళ్ళు ఓటు హక్కుని కలిగి వున్నారు. ‘మేం ఆంధ్రోళ్ళం కాదు, తెలంగాణోళ్ళం..’ అని చెప్పుకుంటున్న ఆంధ్రోళ్ళు బోల్డంతమందే కనిపిస్తారు. హరీష్ రావు కొత్తగా, ‘అక్కడ ఓటు హక్కు రద్దు చేసుకుని, ఇక్కడ ఓటు హక్కు తీసుకోండి..’ అని చెప్పాల్సిన అవసరం లేదు. పైగా, పొరుగు రాష్ట్రంలోని రోడ్ల గురించి ఎద్దేవా చేయాల్సిన పనీ లేదు. తెలంగాణలోనూ కొన్ని ప్రాంతాల్లో రోడ్లు అధ్వాన్నంగా వున్నాయ్.

ఆంధ్రప్రదేశ్‌లో బోల్డన్ని విమానాశ్రయాలున్నాయి.. తెలంగాణలో ఒకే ఒక్కటీ.. అదీ హైద్రాబాద్‌కే పరిమితం.! ప్లస్సులు, మైనస్సులు.. అన్ని రాష్ట్రాలకీ వుంటాయ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన గాయమైంది. అప్పుల ఆంధ్రప్రదేశ్, ధనిక తెలంగాణ.. దీనికి రాష్ట్ర విభజనే కారణమని హరీష్ రావుకి తెలియదా.?

Telangana Minister Harish Rao key Comments On AP | ఏపీ పాలనపై మంత్రి హరీశ్‌ రావు కీలక వ్యాఖ్యలు