Telangana Employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

Telangana Govt Employees

Telangana Govt Employees: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వెళ్తుంది. ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు, రైతు భరోసా, రైతు రుణమాఫీ అమలు చేసిన సంగతి తెలిసిందే. ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నప్పటికీ అటు హామీలను.. ఇటు గత పెండింగ్ బకాయిలను విడుదల చేస్తుంది. ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు జమచేస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏలలో రెండు డీఏలను చెల్లిస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఒకటి అమల్లోకి తీసుకొచ్చారు. మరో డీఏను ఆరు నెలల తర్వాత అమల్లోకి తెస్తామని పేర్కొంది. ఈ క్రమంలోనే ఇటీవల విద్యుత్ ఉద్యోగులకు రెండు శాతం డీఏ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగానే తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లుకు సంబంధించిన నిధులను విడుదల చేసింది. ఇందుకోసం మొత్తం రూ.1803.0 కోట్లు వైద్య బిల్లుల బకాయిల నిధులు రిలీజ్ చేసినట్లు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. దీని వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 26,519 మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట కలుగుతుందని స్పష్టం చేశారు. ఉద్యోగులు, పెన్షనర్ల ఇ బ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ నిధులను విడుదల చేసినట్లు పేర్కొన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని బకాయిలను క్లియర్ చేశామని చెప్పారు. ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లోనూ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులకు తాము ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. కాగా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడుదల చేయడం పట్ల ఉద్యోగులు, పెన్షనర్ల సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.