హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక ఈరోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. అయితే గ్రేటర్ ఎన్నికల నేపధ్యంలో హైదరాబాద్ నగర వాసుల్లో బద్దకం కనిపించింది. దీంతో పలు కేంద్రాల్లో ఓటర్లు లేకపోవడంతో, అక్కడ ఉన్న పోలింగ్ సిబ్బంది ఎక్కువ భాగం ఖాళీగా కూర్చున్నారు. మధ్యాహ్నంతో పోలిస్తే ఉదయమే కాస్త ఎక్కువగా పోలింగ్ నమోదైనట్లు సమాచారం.
ఇక మొత్తంగా చూసుకుంటే గత బల్డియా ఎన్నికలతో పోలిస్తే ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ శాతం దారుణంగా పడిపోవడంతో అన్ని పార్టీలకు ఓటర్లు షాక్ ఇచ్చారని చెప్పొచ్చు. అధికార, ప్రతిపక్షాలు ప్రచారం పెద్ద ఎత్తున చేసినా ఓటర్లు మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆశక్తి చూపకపోవడం గమనార్హం. ఇక ఈ ఎన్నికల్లో మరీ అత్యల్ప పోలింగ్ శాతం నమోదు కావడంతో తప్పు మీదే అంటే మీదే అంటూ టీఆర్ఎస్ అండ్ బీజేపీలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నాయి.
ప్రచారంలో భాగంగా అధికార పార్టీ నేతలు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ అండ్ టీఆర్ఎస్ నేతల రౌడీయిజం కారణంగా పోలింగ్ శాతం తగ్గిందని బీజేపీ నేతలు ఆరోపించారు. ఇక మరోవైపు ఎన్నికల ప్రచార సమయంలో పెద్ద ఎత్తున ఢిల్లీ పెద్దల్ని దింపిన బీజేపీ గ్రేటర్ పరిధిలో ఉన్నా అన్ని డివిజన్లలో ఉన్న ప్రజల్ని భయపెట్టిందని, కాషాయం గ్యాంగ్ ప్రజల్ని విభజించే కుట్ర పన్నారని, దీంతో గ్రేటర్ ప్రజలు భయపడి ఓట్లు వేయడానికి రాలేదని టీఆర్ఎస్ విమర్శించింది.
ఇక ఆ విషయం పక్కన పెడితే ఎన్నికల పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ ఫలితాలకోసం ఎదురు చూసిన వారికి షాక్ తగిలింది. చిన్న చిన్న ఘటనలతో పోలింగ్ ప్రశాంతంగా జరిగినా, ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్‌లో అధికారులు పోలింగ్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ రీపోలింగ్ డిసెంబర్ 3న జరుగనుండగా, ఎన్నికల కౌంటింగ్ 4న జరుగనుంది. దీంతో డిసెంబర్ 3 సాయంత్రం వరకు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయరాదని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎగ్జిట్ పోల్స్ నిషేదంలో రాజకీయవర్గాల్లో ఉత్కంఠం కొనసాగుతోంది.