మళ్ళీ గులాబీ గూటికి ఈటెల రాజేందర్.?

బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, భారతీయ జనతా పార్టీలో కొనసాగే అవకాశం లేదా.? ఆయన తిరిగి గులాబీ గూటికి చేరబోతున్నారా.? కేసీయార్ పతనాన్ని చూడందే నిద్రపోనంటూ శపథం చేసిన ఈటెల, తిరిగి కేసీయార్‌తో సర్దుకుపోవాలనే నిర్ణయానికి వచ్చారా.? రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. ఈటెల రాజేందర్‌కి కేసీయార్ రాజకీయ గురువు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన తెలంగాణ రాష్ట్ర సమితికి దూరం కావాల్సి వచ్చింది. టీఆర్ఎస్‌ని వీడి బీజేపీలో చేరినా, టీఆర్ఎస్‌ని హుజూరాబాద్‌లో ఓడించి, బీజేపీని గెలిపించినా.. ఆయన ఎందుకో బీజేపీలో ఇమడలేకపోతున్నారట.

దాంతో, ఈటెల తిరిగి గులాబీ గూటికి చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. కేసీయార్ కూడా ఈటెల రాజేందర్ తిరిగొస్తే, ఆయన్ని కలుపుకుపోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. కేసీయార్‌‌తో ఇప్పటికే ఈటెల రహస్యంగా భేటీ అయ్యారనే ప్రచారమూ జరుగుతోంది. పెద్దగా ఆలస్యం చేయకుండానే త్వరలో గులాబీ గూటికి చేరిపోతేనే రాజకీయంగా తనకు మంచిదని ఈటెల రాజేందర్ భావిస్తున్నారట కూడా. ఈటెల రాజేందర్‌తోపాటుగా రాజా సింగ్ కూడా గులాబీ గూటికి చేరతారనే ప్రచారం జరుగుతోంది. మరి, రఘునందన్ సంగతేంటి.? ఆయన కూడా బీజేపీలో ఇమడటం కష్టమేనని అంటున్నారు.

తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోళ్ళకు బీజేపీ తెరలేపగా, ఆ ప్లాన్‌ని తిప్పి కొట్టింది టీఆర్ఎస్. ఈ క్రమంలో బీజేపీ శ్రేణులు డీలాపడ్డాయి. మునుగోడు ఉప ఎన్నికలో గులాబీ పార్టీకి గట్టి పోటీ ఇచ్చినా, గెలవలేకపోవడం పట్ల బీజేపీ శ్రేణుల్లో ఒకింత నిర్లిప్తత వ్యక్తమవుతోంది. ఈ కారణంగానే కమలాన్ని వీడి, గులాబీ గూటికి చేరేందుకు పలువురు ముఖ్య నేతలు సిద్ధమవుతున్నారట.