తెలంగాణ ఆపద్ధర్మ సిఎం కేసిఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం అనూహ్య రీతిలో షాక్ ఇచ్చింది. ఆయన వాడిన భాష విషయంలో 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది ఎన్నికల సంఘం. పూర్తి వివరాలు ఇవి.
తెలంగాణ సిఎం కేసిఆర్ కొంగర కలాన్ సభ తర్వాత నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ సభల్లో ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు ను ఉద్దేశించి కేసిఆర్ పచ్చి బూతులు మాట్లాడారు. గలీజు భాషలో వారిపై తిట్ల వర్షం కురిపించారు. కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి ‘‘ థూ మీ బతుకులు చెడ’’ అంటూ ఘాటుగా తిట్టారు. నాలుగున్నరేళ్లు నరేంద్రమోదీ సంకలోనే ఉన్నావు కదా? మోదీ సంక నాకినవు కదా అంటూ చంద్రబాబును ఉద్దేశించి తీవ్రమైన భాషలో కామెంట్స్ చేశారు.
కేసిఆర్ వాడిన భాషపై టిడిపి నేతలు ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర సిఇఓ రజత్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల కమిషన్ కేసిఆర్ భాష అభ్యంతరంగా ఉందంటూ 24 గంటల్లోగా సమాధానం చెప్పాలని నోటీసులు జారీ చేసింది. టిఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు కు ఈ మేరకు నోటీసులు ఇచ్చింది ఎన్నికల కమిషన్.
కేటిఆర్ కు సైతం తాఖీదు :
ఇక మంత్రి కేటిఆర్ కు సైతం తాఖీదు ఇచ్చింది ఎన్నికల కమిషన్. కేటిఆర్ సిరిసిల్లలో ఆర్ ఎమ్ పి, పి ఎం పి లతో జరిగిన సమావేశంలో వారిని ప్రలోభ పెట్టేవిధంగా మాట్లాడినట్లు డాక్టర్ల సంఘం ఆరోపించింది. ఈ మేరకు మంత్రి కేటిఆర్ ను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించాలంటూ డాక్టర్స్ అసోసియేషన్ ఈసికి ఫిర్యాదు చేసింది. వారి ఫిర్యాదు మేరకు కేటీఆర్ కు నోటీసులు జారీ అయ్యాయి. కేటిఆర్ పై ఈసీ కి ఫిర్యాదు చేసిన సంఘం పేరు హెల్త్ కేర్ రిపార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్.
నోటి నుంచి బూతొస్తే తాఖీదే
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో నోటినుంచి ఏ నాయకుడు బూతు భాష మాట్లాడినా ఫిర్యాదు చేసిన వెంటనే ఎలక్షన్ కమిషన్ రియాక్ట్ అవుతున్నది. ఏ నాయకుడు బూతు భాషలో మాట్లాడినా, ఆధారాలు లేకుండా బట్ట కాల్చి మీదేసేలా విమర్శలు చేసినా ఎన్నికల సంఘం యాక్షన్ లోకి దిగుతగున్నది. ఇటీవల బూతులు మాట్లాడిన రేవంత్ రెడ్డికి, హరీష్ రావుకు ఈసి నోటీసులు జారీ చేసింది.
అలాగే హరీష్ రావు కాంగ్రెస్ లోకి రాబోతున్నారని, కేసిఆర్ ను ఓడగొట్టేందుకు తనకు సాయం చేస్తానని మాట ఇచ్చారంటూ గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఆ ఆరోపణలకు తన వద్ద ఆధారాలు లేవన్నారు. ఏ గుడిలో ప్రమాణం చేయమన్నా చేయడానికి తాను సిద్ధమని ప్రకటించారు. దీంతో ఆ ఆరోపణలపై హరీష్ సీరియస్ అయ్యారు. ప్రతాప్ రెడ్డి మీద ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో వంటేరు ప్రతాప్ కు నోటీసులు జారీ అయ్యాయి.
అలాగే హరీష్ రావు ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ పార్టీని నిట్టనిలువునా చీల్చి కూటమికి సపోర్ట్ చేసి సిఎం కాబోతున్నాడంటూ టిడిపి సీనియర్ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి సంచలన ఆరోపనలు చేశారు. కూటమికి, టిఆర్ఎస్ కు సమానంగా సీట్లు వస్తే హంగ్ వచ్చే పరిస్థితే ఉంటే టిఆర్ఎస్ లో ఉన్న 20 మంది తన వర్గం ఎమ్మెల్యేలను తీసుకుని హరీష్ రావు బయటకొస్తారని రేవూరి ఆరోపించారు. రేవూరి మీద కూడా ఫిర్యాదు చేయడంతో ఆయనకు తాఖీదు జారీ అయింది.
మొత్తానికి ఆలస్యంగా అయినా ఈసి గట్టిగానే రియాక్ట్ అవుతుండడంతో రాజకీయ పార్టీలకు వనుకు మొదలైంది.