‘కవితక్క’ విచారణ.! కొత్తగా ఏమైనా ఆశించారా.?

రాజకీయ నాయకులన్నాక సీఐడీ, సీబీఐ, ఈడీ.. ఇలా దర్యాప్తు సంస్థల నుంచి ఎప్పుడో ఒకప్పుడు విచారణ ఎదుర్కోవాల్సి రావొచ్చు. సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలే రాజకీయ పంజరంలో చిలకలా మారిపోతున్నాయన్న విమర్శలు లేకపోలేదు. సో, ఎవరూ ఈ తరహా విచారణలకు అతీతం కాదు. ఆ సంగతి రాజకీయ నాయకులందరికీ తెలుసు.

పోలీసులతో సులువుగా అధికార పార్టీలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్ని రాజకీయ నాయకుల మీద పెట్టించేస్తున్న రోజులివి. అవినీతి కేసులైతే కోకొల్లలు. తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. సుదీర్ఘంగానే విచారణ జరిగింది ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో విచారణ అనంతరం ఆమె తిరిగి హైద్రాబాద్ వచ్చేశారు. తన తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఢిల్లీలో ఏమవుతుందోనని కేసీయార్, గులాబీ పార్టీ ముఖ్య నేతల్ని ఢిల్లీకి పంపిన సంగతి తెలిసిందే.

కొత్తగా ఏం జరుగుతుంది.? మహా అయితే కవితను అరెస్టు చేసేవారు. అంతకు మించి ఏమీ జరగదు కదా. విచారణ జరిగింది, ఇంటికి పంపేశారు. మళ్ళీ విచారణకు పిలుస్తారేమో.! ఈమాత్రందానికి ఇంత హంగామా ఎందుకు.? ‘అరెస్టు చేయకపోతే ముద్దు పెడతారా.?’ అంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, కవిత మీద చేసిన వ్యాఖ్యలు చిత్రంగా వైరల్ అయ్యాయి.. ఆయన అరెస్టుకు రంగం సిద్ధమవుతోందిట కూడా. రాజకీయాలంటేనే అంత.! ఈ దెబ్బతో కవితకు విపరీతమైన పబ్లిసిటీ అయితే వచ్చింది. ‘వి స్టాండ్ విత్ కవితక్క’ అనే హ్యాష్ ట్యాగ్‌ని గులాబీ శ్రేణులు ట్రెండింగ్‌లోకి తెచ్చాయ్.!