Congress Party: ఆ మంత్రి కుర్చీ కోసం కాంగ్రెస్ నేతల ‘పవర్ గేమ్’!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి పదవి కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో హోరాహోరీ పోటీ మొదలైంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై మళ్లీ ఊహాగానాలు ఊపందుకోవడంతో ఈ సారి జిల్లాకు కచ్చితంగా ప్రాతినిధ్యం లభిస్తుందని అక్కడి నేతలు ఆశపడుతున్నారు. గతంలో మొదటి విడత కేబినెట్‌లో వీరికి అవకాశం రాకపోవడం, పార్లమెంట్ ఎన్నికల తర్వాత విస్తరణ జరుగుతుందని వచ్చిన వార్తలతో కలవరపడిన నేతలు ఇప్పుడు మళ్లీ తమ అదృష్టం మెరుగవుతుందనే ఆశలో ఉన్నారు.

జిల్లాలోని నాలుగు స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెన్నూరు నుంచి గడ్డం వివేక్, మంచిర్యాల నుంచి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్, ఖానాపూర్ నుంచి ప్రధానంగా వివేక్ – ప్రేమ్ సాగర్ మధ్య పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. ఈ వర్గం వారు ఎవరికి వారు ప్లస్ పాయింట్లను చూపుతూ ఢిల్లీకి తమ వాదనలు వినిపిస్తోంది. సీనియర్ నేతగా, కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి కుమారుడిగా వివేక్‌కు గుర్తింపు ఉన్నా, ఆయన పార్టీ మారిన నేపథ్యం కొంత నెగటివ్‌గా మారిందని చెబుతున్నారు.

ఇక ప్రేమ్ సాగర్ రావు మాత్రం పార్టీ కోసం కొనసాగిన విశ్వాసాన్ని హైలైట్ చేస్తూ, భట్టి పాదయాత్ర, రేవంత్ నిర్వహించిన సభల విజయాన్ని తన క్రెడిట్‌గా చూపిస్తున్నారు. మరొకవైపు గడ్డం వినోద్ ఢిల్లీ వద్ద ప్లాన్ చేస్తూ.. తాను ఎప్పటికీ పార్టీకి కట్టుబడి ఉన్నానని రుజువు చేస్తున్నారని తెలుస్తోంది. అదేవిధంగా ఆదివాసీ కోటాలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జుకు అవకాశం ఇవ్వాలని ఆయన వర్గం ప్రస్తావిస్తోంది.

ఓ వైపు సీనియార్టీ, మరోవైపు నిబద్ధత, అదే సమయంలో సామాజిక సమతుల్యత అన్న కోణాల్లోని ఈ పోటీపై కాంగ్రెస్ అధిష్టానం సున్నితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. మంత్రి పదవి రూపంలో ఎవరిని అదృష్టం వరించనుందో తెలియాలంటే మంత్రివర్గ విస్తరణ వరకు వేచి చూడాల్సిందే. కానీ ఈ పదవి కోసం జరుగుతున్న ఇన్ సైడ్ వార్ మాత్రం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.