తెలంగాణలో కాంగ్రెస్, టిడిపి పొత్తు ఓకే, ఆ ఒక్క సీటుపైనే చిక్కుముడి

తెలంగాణలో ప్రతిపక్ష కాంగ్రెస్, టిడిపి మధ్య ఎన్నికల పొత్తు ఖరారైపోయిందా? సీట్ల సర్దుబాటు కూడా కొలిక్కి వచ్చినట్లేనా? ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఏ సీట్లు తీసుకుంటారు? ఈ అంశాలపై నిర్ణయాలు జరిగిపోయాయని రెండు పార్టీల నేతలు అంటున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది? టిడిపికి ఎన్ని సీట్లు కట్టబెడుతుంది అన్న దానిపై ఇప్పటికే కసరత్తు పూర్తయిందని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ మధ్య పొత్తు కుదురుతుందని చర్చ జరుగుతున్న నేపథ్యంలో టిడిపి 30 అసెంబ్లీ, 5 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ ను కోరిందని అంటున్నారు. అయితే అంత కాకపోయినా టిడిపి కి 15 అసెంబ్లీ, ఒక లోక్ సభ సీటు ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని కాంగ్రెస్ పార్టీ తేల్చింది. దీంతో దీనిపై ఇంకా అధికారికంగా నిర్ణయం రాకపోయినా అనధికారికంగా చర్చలు ఫలప్రదమైనట్లు చెబుతున్నారు. ముందస్తు వచ్చినా, సకాలంలో ఎన్నికలు వచ్చినా పొత్తు మాత్రం ఖరారైపోయిందని అంటున్నారు. టిడిపి ఏఏ సీట్లు కోరుతున్నది, కాంగ్రెస్ ఏరకమైన వైఖరితో ఉన్నది అనేదానిపై ఒక విశ్లేషణ చదవండి.

గత ఎన్నికల్లో తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టిడిపి సింహభాగం సీట్లు గెలిచింది. గ్రేటర్ మినహాయిస్తే తెలంగాణ అంతటా వరంగల్ లో ఎర్రబెల్లి దయాకర్ రావు, ఖమ్మం సత్తుపల్లిలో సండ్ర వెంకట వీరయ్య, కొడంగల్ లో రేవంత్ రెడ్డి, నారాయణపేటలో రాజేందర్ రెడ్డి మాత్రమే గెలుపొందారు. మిగిలిన సభ్యులందరూ హైదరాబాద్ శివార్లలోనే గెలిచారు. అంటే ఆంధ్రా సెటిలర్లు ఎక్కువగా ఉన్న చోట్ల టిడిపి గెలిచింది. దీన్నిబట్టి తెలంగాణలో ఉన్న ఆంధ్రా సెటిలర్లు గత  ఎన్నికల్లో టిడిపికి గుండుగుత్తగా ఓట్లేశారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా సెటిలర్లు టిడిపికే ఓటేస్తారన్న ఉద్దేశంతో సెటిలర్ల ప్రభావం ఎక్కువగా ఉన్న స్థానాల్లో ఎక్కువ సీట్లు టిడిపికి ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో టిడిపికి సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించినట్లు చెబుతున్నారు.

30 సీట్లు కోరినా ప్రధాన ప్రతిపక్షంగా మిగతా పార్టీలతో కూడా పొత్తులు ఉంటాయని, కాబట్టి అన్ని సీట్లు ఇవ్వలేమని కాంగ్రెస్ నేతలు టిడిపిని బుజ్జగించారు. దీంతో సెటిలర్లు ఎక్కువగా ఉన్న శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, మేడ్చల్, మల్కాజ్ గిరితోపాటు జూబ్లిహిల్స్ నియోజకవర్గాలను టిడిపికి ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించినట్లు వార్తలొస్తున్నాయి. వీటితోపాటు మిగతా రూరల్ తెలంగాణ జిల్లాల్లో టిడిపి సిట్టింగ్ సీటైన సత్తుపల్లి సండ్ర వెంకట వీరయ్య సీటు టిడిపికే ఇచ్చేందుకు అంగీకరించారు. ఇక టిడిపి తెలంగాణ శాఖ అధ్యక్షులు ఎల్.రమణ కోసం జగిత్యాల సీటు, రావుల చంద్రశేఖరరెడ్డి కోసం వనపర్తి, లేదా దేవరకద్ర సీటు, కొత్తకోట దయాకర్ రెడ్డి కోసం మఖ్తల్ సీటు, మండవ వెంకటేశ్వరరావు కోసం నిజామాబాద్ రూరల్ సీటు, అన్నపూర్ణమ్మ కోసం బాల్కొండ లేదా ఆర్మూరు సీటు, రేవూరి ప్రకాష్ రెడ్డి కోసం నర్సంపేట లేదా పరకాల సీటు, ఎర్ర శేఖర్ కోసం జడ్చర్ల సీటు తమకు కచ్చితంగా కేటాయించాల్సిందే అని టిడిపి డిమాండ్ చేస్తున్నది.

టిడిపి కోరే స్థానాల్లో జగిత్యాల జీవన్ రెడ్డి సిట్టింగ్ సభ్యుడిగా  ఉన్నారు. వనపర్తిలో చిన్నారెడ్డి సిట్టింగ్ గా ఉన్నారు. జడ్చర్లలో పిసిసి ఉపాధ్యక్షులు మల్ల రవి పోటీ చేస్తారని చెబుతున్నారు. దీంతో ఈ సీట్ల విషయంలో కొద్దిగా క్లారిటీ వచ్చిందని చెబుతున్నారు. చిన్నారెడ్డి, రావుల చంద్రశేఖరరెడ్డి ఇద్దరినీ వనపర్తి దేవరకద్ర సీట్లు కేటాయిస్తే అక్కడ చిక్కు లేకుండాపోతుందంటున్నారు. ఇక జడ్చర్ల సీటు ఆశిస్తున్న డాక్టర్ మల్లు రవిని నాగర్ కర్నూలు పార్లమెంటుకు పంపొచ్చని అంటున్నారు. ఇక ఝటిలమైన సీటు జగిత్యాల. ఇక్కడ జీవన్ రెడ్డి సిట్టింగ్ సభ్యుడు ఉన్నారు. ఆయనను కదిలించి ఎల్ రమణకు సీటు కేటాయించడం సాధ్యమేనా అన్న చర్చ ఉంది. ఇటు చూస్తే సిట్టింగ్… అటు చూస్తే టిడిపి తెలంగాణ శాఖ అధ్యక్షులు ఉన్నారు. ఈ సీటుపై పీఠముడి పడిందంటున్నారు.

సూర్యాపేట జిల్లాలోని కోదాడ సీటును కూడా టిడిపి అడుగుతున్నట్లు చెబుతున్నారు. ఆ సీటు కోసం బొల్లం మల్లయ్య యాదవ్ పోటీ చేస్తారని అంటున్నారు. అక్కడ ప్రస్తుతం టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమెను కదిలించడం ఈజీనా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆమెను కదిలించే పక్షంలో ఆమెను నల్లగొండ పార్లమెంటుకు పోటీ చేయించవచ్చని అంటున్నారు.

పార్లమెంటు సీట్ల విషయానికి వస్తే ముందుగా 5 ఎంపి సీట్లు అడిగినా టిడిపి కి ఒక సీటు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించిందని చెబుతున్నారు. ఖమ్మం పార్లమెంటు టిడిపికి కట్టబెట్టేందుకు కాంగ్రెస్ అంగీకరించిందని అంటున్నారు. ఇక్కడ టిడిపి సీనియర్ నేత నామా నాగేశ్వరరావు గతంలో ఎంపిగా పని చేశారు. ఆయన కోసం ఆ సీటును కేటాయించేందుకు కాంగ్రెస్ ఓకే చెప్పేసినట్లు చెబుతున్నారు. అయితే మల్కాజ్ గిరి లోక్ సభ సీటు కూడా కావాలని టిడిపి గట్టిగానే పట్టు పడుతున్నట్లు చెబుతున్నారు. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదని అంటున్నారు.

తెలంగాణలో ముందస్తు హడావిడి నేపథ్యంలో పొత్తుపై రెండు పార్టీల్లో వేడి పెరిగిందని చెబుతున్నారు. పొత్తు కుదిర్చే బాధ్యతలను కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ నేత, మాజీ మంత్రి అయిన వ్యక్తితోపాటు, అధిష్టానం దూతగా మరో వ్యక్తి పొత్తు చర్చల్లో పాలుపంచుకున్నట్లు చెబుతున్నారు. ఇక టిడిపి నుంచి ఒక మీడియా గ్రూపు యజమాని, చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన ఇద్దరు పెద్దలు ప్రముఖులు చర్చల్లో భాగస్వామలైనట్లు చెబుతున్నారు. వీరి మధ్య ఇప్పటికే అవగాహన కుదిరినట్లు కూడా చెబుతున్నారు. తెలంగాణలో టిఆర్ఎస్ ను ఎదుర్కోవాలంటే రెండు పార్టీల మధ్య పొత్తు తప్పదని ఇరు పార్టీలు అంగీకారానికి వచ్చినప్పటి నుంచే పొత్తు చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. ముందస్తు ముచ్చట్ల ఆధారంగా పొత్తుపై అడుగులు వేయాలని భావిస్తున్నారు ఇరు పార్టీల నేతలు.