ముందస్తు ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల తర్వాత కూడా ఊహించని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. దేశమంతా కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తున్నప్పటికీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారిపోతున్నది. ఎన్నికల ఫలితాలు వచ్చి పది రోజులు కాకముందే టిఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు కాంగ్రెస్ విలవిలలాడుతున్నది. ఇద్దరు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టిఆర్ఎస్ లో చేరేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. వారిద్దరూ గురువారం సిఎం కేసిఆర్ ను ప్రగతి భవన్ లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వారు గులాబీ గూటిలో చేరడం లాంఛనమే అయింది. పూర్తి వివరాలు ఇవీ.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్ కుమార్ ఇద్దరూ వేరువేరుగా ప్రగతి భవన్ వచ్చి కేసిఆర్ ను కలిశారు. పూల బొకే ఇచ్చి కేసిఆర్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. కేసిఆర్ ఘన విజయం సాధించడం పట్ల వారు టిఆర్ఎస్ అధినేతకు అభినందనలు తెలిపారు. దీంతో వారిద్దరూ టిఆర్ఎస్ కు జంప్ చేయడం ఖాయమని తేలిపోయింది. రెండోసారి సర్కారులోకి వచ్చిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్సీల పై వల వేసి ఆపరేషన్ ఆకర్ష ను ప్రయోగించడం చర్చనీయాంశమైంది.
ఆకుల లలిత ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆమె నిజామాబాద్ జిల్లా నాయకురాలు. మొన్నటి ఎన్నికల్లో ఆమె పట్టుపట్టి మరీ టికెట్ తెచ్చుకుని ఆమె నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు నియోజకవర్గంలో పోటీ చేశారు. అయితే కారు ప్రభంజనం జోరుకు తట్టుకోలేక ఓటమిపాలయ్యారు. దీంతో ఎమ్మెల్సీగా తన పదవిని కాపాడుకోవడంతోపాటు భవిష్యత్తు రాజకీయాల కోసం ఆమె టిఆర్ఎస్ లో చేరడానికి నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఆకుల లలిత రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ శిష్యురాలుగా రాజకీయాల్లోకి వచ్చినట్లు చెబుతారు. డిఎస్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టిఆర్ఎస్ లో చేరినా ఆమె మాత్రం కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. అయితే ఇప్పుడు డిఎస్ పరిస్థితి కుడితిలో పడిన ఎలుక మాదిరిగా తయారైంది. దీంతో ఆయన వారసురాలిగా రాజకీయాల్లోకి నెట్టుకురాలేమన్న ఉద్దేశంతో ఆమె కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. శాసనసమండలి వైస్ చైర్మన్ స్వామిగౌడ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి సమక్షంలో ఆకుల లలిత కేసిఆర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. డేట్ ఫిక్స్ కాగానే గులాబీ కండువా కప్పుకోనున్నారు.
ఇక మరో ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి. సంతోష్ కుమార్ పెద్దగా రాజకీయాల్లో కనబడని వ్యక్తి. అయితే ఆపరేషన్ ఆకర్ష దెబ్బకు ఈయన కూడా కారెక్కేందుకు రెడీ అయ్యారు. కరీంనగర్ మేయర్ రవీంద్రసింగ్, తెలంగాణ ఇరిగేషన్ కార్పొరేషన్ ఛైర్మన్ ఈద శంకర్ రెడ్డితో పాటు ప్రగతి భవన్ వచ్చిన సంతోష్ కుమార్ కేసిఆర్ పూలబొకే ఇచ్చి అభినందనలు తెలిపారు. డేట్ ఫిక్స్ కాగానే సంతోష్ కూడా టిఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. సంతోష్ కుమార్ పద్మశాలి సామాజికవర్గానికి చెందిన నాయకుడు. టిడిపి రమణకు సోదరుడు అవుతాడు.
కౌన్సిల్ లో వీరిద్దరు ఎమ్మెల్సీలు కారెక్కేందుకు రెడీ కావడంతో ఇక తెలంగాణ శాసనమండలిలో టిడిపి లాగే కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రాతినిథ్యం కోల్పోయే ప్రమాదంలో పడిందని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. మార్చి నెలతో కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీ పదవీ కాలం ముగియనుంది. దీంతో మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ కు ప్రాతినిథ్యం లేకుండా చేయడమే లక్ష్యంగా టిఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ మంత్రం ప్రయోగిస్తున్నట్లు చెబుతున్నారు.