ఢిల్లీ : ‘కుష్బూ’ మాదిరిగానే ‘విజయశాంతి’ కుడా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బాయ్ చెప్పేసి బీజేపీ పార్టీలోకి జాయిన్ అవ్వటానికి రంగం సిద్ధం చేసుకుంది. ఆదివారం నాడు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో విజయశాంతి భేటీ అయ్యారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డిని కూడా కలిశారు. విజయశాంతి వెంట తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, వివేక్ ఉన్నారు. విజయశాంతి సోమవారం బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కమలం పార్టీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఢిల్లీ పెద్దల సమక్షంలో విజయశాంతి సోమవారం బీజేపీలో చేరుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ విజయశాంతిని సముదాయించేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్‌ను రంగంలోకి దింపినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. పార్టీ ఆదేశాల మేరకు కుసుమ కుమార్ విజయశాంతి నివాసానికి వెళ్లి మరీ చర్చలు జరిపారు. ఈ చర్చలు విఫలమయ్యాయి.
ఈ భేటీ అనంతరం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ విజయశాంతి తిరిగి మాతృ సంస్థకు చేరడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆమె క్రియాశీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ను ఎదుర్కొనే ఏకైక పార్టీ బీజేపీయేనన్నారు. తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ అణచివేశారని ఆయన విమర్శించారు. కుటుంబ, అవినీతి పాలనపై పోరాటం చేస్తామన్నారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై అమిత్ షా అభినందించారని ఆయన వెల్లడించారు. తాము ఆకర్ష్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదని, తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయం కనుక అందరు తమ పార్టీలో జాయిన్ అవతున్నారని ఆయన పేర్కొన్నారు.