రేవంత్ రెడ్డికి గులాం నబీ ఆజాద్ బంపర్ ఆఫర్ (వీడియో)

కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కొడంగల్ లో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కలకలం రేపుతున్నాయి. రేవంత్ రెడ్డి సీఎం సీటులో కూర్చునే అవకాశాలు ఉన్నాయని ఆజాద్ కొడంగల్ లో కామెంట్ చేయడం చర్చనీయాంశమైంది. మంగళవారం రేవంత్ విడుదల అయిన తర్వాత గులాం నబీ ఆజాద్ రేవంత్ ను పరామర్శించారు. రేవంత్ రెడ్డి అరెస్టును ఆయన ఖండించారు. అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు టిపిసిసిలో కలవరం రేపుతున్నాయి. ఆజాద్ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర చర్చ జరుగుతోంది.  

రేవంత్ రెడ్డి జడ్చర్ల ట్రైనింగ్ సెంటర్ నుంచి విడుదల కాగానే ప్రచార నిమిత్తం సభకు వెళ్లారు. అదే సమయంలో గులామ్ నబీ ఆజాద్ రేవంత్ ను పరామర్శించడానికి రేవంత్ రెడ్డికి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో రేవంత్ ప్రచారంలో ఉండడంతో రేవంత్ కోసం గులామ్ నబీ ఆజాద్ గంట పాటు రేవంత్ కోసం వెయిట్ చేశారు. ఆజాద్ ఇంటి దగ్గర ఉన్న విషయం తెలుసుకొని రేవంత్ తన ప్రచారాన్ని త్వరగా  ముగించుకొని  ఇంటికి వచ్చారు. 

రేవంత్ రెడ్డిని పరామర్శించిన తరువాత ఆజాద్ మీడియాతో మాట్లాడారు. అధికారం ఎన్నటికీ శాశ్వతం కాదని గులామ్ నబీ అజాద్ తెలిపారు. అధికారంలో ఉన్నామని కళ్లు నెత్తికి ఎక్కకూడదని, కాళ్లు నేలపైనే ఉండాలని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు కేసీఆర్…. రేవంత్ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలులో పెట్టి కొడంగల్ రావడం ప్రజాస్వామ్యమా? అని ఆయన ప్రశ్నించారు. పరిపాలన చక్కగా చేసి ఉంటే రేవంత్ రెడ్డి ఎందుకు ప్రశ్నిస్తారని అన్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత ఉంది కాబట్టే ప్రతిపక్షంగా తమ పని చేస్తున్నామన్నారు. సింహాన్ని బోనులో బంధించి అడవిలో తిరగడం గొప్ప కాదన్నారు. 

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఆ విషయాన్ని కేసీఆర్ మర్చిపోవద్దని కేసీఆర్ కు ఆజాద్ హితవు పలికారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తన పాత్ర కూడా ఉందని, ఉద్యమ సమయంలో కేసీఆర్ సోనియా చుట్టు తిరిగిన విషయం అందరికి గుర్తు ఉందన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఇష్టమొచ్చినట్టు తిట్టడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆజాద్ అన్నారు.

అధికారం అన్నది ఎప్పటికీ శాశ్వతం కాదనీ, ఈ రోజు సీఎం కుర్చీపై కేసీఆర్ ఉన్నారనీ.. రేపు అదే కుర్చీపై రేవంత్ రెడ్డి ఉండొచ్చని వ్యాఖ్యానించారు.రేవంత్ సీఎం అవ్వొచ్చు అని ఆజాద్ చెప్పగానే కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. రేవంత్ రెడ్డి నాయకత్వం వర్దిల్లాలి అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. రేవంతన్న సీఎం అంటూ హోరెత్తించారు.

 ఆజాద్ వ్యాఖ్యలతో టీకాంగ్రెస్ లో కలకలం చెలరేగింది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి సీఎం రేసులో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి సహా పలువురు కీలక నేతలు ఉన్నారు. కాంగ్రెస్ లో చాలా కాలంగా ఉంటున్న తమను కాదని నిన్న మొన్న వచ్చిన రేవంత్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వడం పై పలువురు నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఈ దశలో రేవంత్ రెడ్డే సీఎం కావొచ్చు అని గులాం నబీ ఆజాద్ మాట్లాడడంతో అంతా చర్చించుకుంటున్నారు.

మాములు నేతలు ఎవరైనా మాట్లాడి ఉంటే కాంగ్రెస్ నేతలు కూడా నిశ్శబ్దంగా ఉండే వారేమో కానీ గులాం నబీ ఆజాద్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక పాత్ర పోషించారు. గతంలో ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు ఇంచార్జీగా కూడా పని చేశారు. గులాంనబీ ఆజాద్ కు తెలంగాణ రాజకీయాలపై పట్టు కూడా ఉంది.  సోనియా, రాహుల్ గాంధీలు సైతం తెలంగాణ వ్యవహారాలకు సంబందించి ముందుగా ఆజాద్ నే సంప్రదిస్తారని తెలుస్తోంది. దీంతో తెలంగాణ నేతల్లో కలవరం మొదలైంది. రేవంత్ శిబిరంలో ఆనందోత్సాహాలు మొదలయ్యాయి.  ఆజాద్ మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి. 

 

రేపు సి.ఎం సీట్లో రేవంత్ రెడ్డి ఉండొచ్చు.గులాం న‌బీ ఆజాద్ Ghulam Nabi Azad on revanth reddy cm