కామెంట్ – కౌంటర్: కవితపై నెట్టింట ఫైట్ వైరల్!

ఢిల్లీ లిక్కర్ కేసులో తనకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇవ్వడంపై బీఆరెస్స్ ఎమ్మెల్యే కవిత స్పందించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన “తెలంగాణ తలవంచదు” వ్యాఖ్యలపై నెటిజన్లు పెడుతున్న కామెంట్లు వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని కవితకు మద్దతుగా ఉండగా.. మరికొన్ని నెగిటివ్ గా ఉంటున్నాయి!

అవును… “కేంద్రంలోని ప్రజావ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ తలవంచదు” అంటూ ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు. వాటిలో కొన్ని వైరల్ అవ్వడంతోపాటు.. తెలంగాణ సమాజాన్ని ఆలోచించుకునేలా చేస్తున్నాయని అంటున్నారు. అయితే.. కవితకు పాజిటివ్ గా వస్తున్న కామెంట్లు – వాటికి వైరల్ గా మారుతున్న కౌంటర్ కామెంట్లను ఇప్పుడు చూద్దాం!

కామెంట్: “మహిళా దినోత్సవం రోజునే ఒక మహిళకు ఈడీ నోటీసులు” ఇవ్వడం – కేంద్రంలోని బీజేపీ కక్ష పూరిత చర్య కాక ఇంకేమిటి?

కౌంటర్: ఈడీ నోటీసులు ఇవ్వాలనుకుంటే ఆదివారం – శనివారం అంటూ… “వారం – వర్జం చూసుకోదు”!

కామెంట్: 16కు పైగా పార్టీలను కలుపుకుంటూ “జంతర్ మంతర్ వద్ద కవిత చేయబోయే దీక్షకు బీజేపీ బెదిరింది” అనడానికి ఇదే సాక్ష్యం!

కౌంటర్: కవితను అరెస్టు చేయడం లేదు… విచారణకు రమ్మంటున్నారు. “9న విచారణ అనంతరం 10న దీక్ష చేసుకోవచ్చు”! బోడి గుండుకీ మోకాలీకీ ముడెందుకు.. రెండూ వేరు వేరు రోజులు, రెండింటికీ ఢిల్లీలోనే వేదికలు కదా!

కామెంట్: కేంద్రంలోని ప్రజావ్యతిరేక ప్రభుత్వానికి “తెలంగాణ తలవంచదు”!

కౌంటర్: మాటి మాటికి తెలంగాణ పేరును తీసి “ఎందుకు సెంటిమెంట్లను రాజేయలని చూస్తారు?” మీరు చేసే పనులకు, “తెలంగాణ సమాజానికి అసలేంటి సంబంధం”?

కామెంట్: “తెలంగాణ విషయం”లో కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది? మోడీ ఎత్తులకు తెలంగాణ తలవంచదు!

కౌంటర్: “తెలంగాణ అంటే మీరొక్కరే కాదు..” మీకు నోటీసులిస్తే యావత్ తెలంగాణకి ఇచ్చినట్టు కాదు!

కామెంట్: చట్టసభల్లో “మహిళా రిజర్వేషన్” కోసం పోరాడుతుంటే… గొంతునొక్కేస్తున్నారు?

కౌంటర్: మీ పార్టీలో “ఎంతమంది మహిళా ఎమ్మెల్యేలు – ఎంపీలు ఉన్నారు”? తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో కేసీఆర్ మహిళలకు చోటెందుకు ఇవ్వలేదు? అప్పుడు మీరెందుకు ప్రశ్నించలేదు?

కామెంట్: మహిళలంటే ఈ కేంద్ర ప్రభుత్వానికి చులకన.. దానిఫలితమే మహిళా దినోత్సవం రోజున నోటీసులు!

కౌంటర్: మీ లిక్కర్ దందా వళ్ల “తెలంగాణ ఆడబిడ్డలు అంతా తల వంచుకునే పరిస్థితి” వచ్చింది. తెలంగాణ ఆడబిడ్డలంటే… లిక్కర్ స్కాం బిడ్డలు కాదు!

ఈ రేంజ్ లో వేల మంది నెటిజన్లు స్పందిస్తూ.. కవిత ట్వీట్‌ కి – బీఆరెస్ నేతల మాటలకి.. కామెంట్స్ రూపంలో చురకలంటిస్తున్నారు! ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి!