ఈసారి ఒంటరిగానే అంటున్న చంద్రబాబు… లాజిక్ వెనుక కారణం ఇదే!

జనాలకు ఏమీ తెలియదు అనే భ్రమలో ఉంటూ… సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో.. వాస్తవాలు మరిచి హడావిడి చేయడంలో చంద్రబాబుని మించిన వారు లేరని అంటుంటారు! ఈ మేరకు చంద్రబాబు ఫెర్మార్మెన్స్ కూడా అలానే ఉంటుందని చెబుతుంటారు. ఈ సమయంలో రాబోయే తెలంగాణ ఎన్నికల్లో పోటీ విషయంపై చంద్రబాబు తాజాగా స్పందించారు!

ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలు ఫుల్ హడావిడిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు కూడా ఎంటరయ్యారు. తెలంగాణలో ఈసారి ఒంటరిగా పోటీచేయనున్నట్లు తెలిపారు. తాను ఏ పార్టీతోనూ పొత్తులో వెల్లబోయేది లేదని తేల్చి చెప్పారు.

అంతవరకూ బాగానే ఉంది కానీ… ఇక్కడ గమనించాల్సిన అసలు విషయం మరొకటి ఉంది. అదేమిటంటే… నిజానికి చంద్రబాబు నాయుడు ఎవరితోనూ పొత్తు పెట్టుకోను అనడం కాదు… ఆయనతో పొత్తు పెట్టుకోవడానికి తెలంగాణలో ఎవ్వరూ సంసిద్ధంగా లేరు! 2018 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పతనాన్ని నిర్దేశించిన తర్వాత తెలంగాణలో బాబుకి ఆ ఛాన్స్ పోయింది!

అటు బీజేపీ నేతలు కానీ, ఇటు కాంగ్రెస్ నేతలు కానీ… చంద్రబాబు పేరు చెబితే అంతదూరం పారిపోతున్నారని అంటున్నారు. అయితే చంద్రబాబు మాత్రం తమతో పొత్తుకు చాలా పార్టీలు వెంపర్లాడుతున్నా కూడా… తాము మాత్రం అన్ని స్థానాల్లోనూ ఒంటరిగా పోటీచేయబోతున్నాట్లు చెప్పుకోవడం గమనార్హం!

ఓటుకు నోటు అనంతరం కనుమరుగైపోయింది.. చరిత్ర గర్భంలో కలిసిపోబోతుంది అని చెప్పుకున్న టి.టీడీపీ బాధ్యతలు కాసాని జ్ఞానేశ్వర్ చేపట్టిన తర్వాత కాస్త హడావుడి చేస్తున్నారు. ఫలితంగా… అన్ని చోట్ల పోటీ చేస్తాం అని చంద్రబాబు అనగలుగుతున్నారు గాని, వాస్తవానికి తెలుగుదేశానికి తెలంగాణలో కనీసం 119 మంది అభ్యర్థులు ఉన్నారా అనేది ప్రజలలో పెద్ద ప్రశ్నగా ఉంది!

మరోపక్క ఈ మధ్యకాలంలో… రాబొయే ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపున పోటీ చేయబోతున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇప్పుడేమో చంద్రబాబు ఒంటరిగా పోటీ చేయబోతున్నట్లు చెబుతున్నారు. అయితే ఇక్కడే బాబు బ్రెయిన్ షార్ప్ గా పనిచేసిందని అంటున్నారు పరిశీలకులు. కారణం.. తెలంగాణలో టీడీపీ కంటే ఘోరంగా జనసేన ఉండటమేనట!

ఇక బీజేపీ నేతలు అయితే ఎన్డీయే లో టీడీపీని కలుపుకునే ఆలోచన చేయడం లేదని చెబుతున్నారు. ఇదే సమయంలో 2018 ఎన్నికల సమయం గుర్తొస్తుంటే వణికిపోతున్న కాంగ్రెస్ నేతలు… బాబు పేరు ఎత్తడానికి కూడా ధైర్యం చేయలేకపోతున్నారని అంటున్నారు. దీంతో… మరో ఆప్షన్ లేక, దాన్ని కూడా తన గొప్పతనంగా మార్చుకున్న బాబు… రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు చెప్పారు. అయితే 119 సీట్లలోనూ చేస్తారా.. లేక 19 అయినా చేస్తారా అన్నది వేచి చూడాలి!