రేవంత్ కు కొత్త టెన్షన్… చంద్రబాబు నుంచి మిస్డ్ కాల్స్?

గతకొన్ని రోజులుగా, మరి ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త జోష్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా పొంగులేటి, జూపల్లి వంటి నేతలు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవడం, అసమ్మతి రాగాలు వినిపించకపోవడం, అసంతృప్తులు కనిపించకపోవడంతో పాటు తాజాగా ఖమ్మం సభ గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో డబుల్ జోష్ ఉందని తెలుస్తుంది. ఈ సమయంలో టి. కాంగ్రెస్ చీఫ్ రేవంత్ కు కొత్త సమస్య వచ్చిందని తెలుస్తుంది.

అవును… ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జోరుమీదుండటంతో చంద్రబాబు రంగంలోకి దిగబోతున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా 2018నాటి రోజులను గుర్తుచేస్తూ… కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయాలని, అందుకు రేవంత్ ని ఒప్పించేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారని అంటున్నారు. పైగా రేవంత్ ని ఒప్పించడం సులువే అనే నమ్మకంతో ఉన్నారని అంటున్నారు.

దీంతో… ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి తెలంగాణ కాంగ్రెస్ నేతల చెవుల్లో పడిందని తెలుస్తుంది. దీంతో 2018 నాటి సంగతులు తలచుకుని ముచ్చెమటల్లో మునిగిపోతున్నారంట టి.కాంగ్రెస్ నేతలు. కారణం.. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తో జతకట్టిన చంద్రబాబు… తెలంగాణ గడ్డపై వారికి చేసిన డ్యామేజ్ అంతా ఇంతా కాదని కామెంట్లు వినిపిస్తుండటమే!

2018లో తెలంగాణ కాంగ్రెస్ తో టీడీపీ అధినేత చంద్రబాబు ఒప్పందం చేసుకొని కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకొన్న సంగతి తెలిసిందే. దీంతో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ వేవ్ ఉన్నప్పటికీ.. చంద్రబాబు ఎంట్రీతో కేసీఆర్ మాటల్లో వేడి పెరిగింది. కాంగ్రెస్ ను వాయించడానికి ఒక బలమైన కారణం దొరికింది. ఫలితంగా రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.

ఆ ఎన్నికల్లో కూకుట్ పల్లిలో ప్రచారం మొదలుపెట్టిన చంద్రబాబు… అది అక్కడితోనే ఆపేసి ఏపీకి వెళ్లిపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు. అలాకాకుండా తగుదునమ్మా అంటూ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన బహిరంగ సభల్లో వేదికలు ఎక్కడం, అక్కడున్న కాంగ్రెస్ నాయకులతో కలిసి చేతులెత్తడం విక్టరీ సింబల్ చూపించడం చేస్తుండేవారు!

దీంతో… తెలంగాణలో మరోసారి ఆంధ్ర పెత్తనమా అంటూ కేసీఆర్ మైకందుకున్నారు. ఫలితం అందరికీ తెలిసిందే! ఇదే క్రమంలో ప్రస్తుతం జోస్ మీదున్న కాంగ్రెస్ కు టీడీపీని తగిలించి ఎంతో కొంత మనుగడ తెచ్చుకోవాలని బాబు భావిస్తున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా రేవంత్ కు మిస్డ్ కాల్స్ వెళ్తున్నాయని సమాచారం.

దీంతో ఆందోళన చెందుతున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేవంత్ ను రిక్వస్ట్ చేస్తున్నారంట. ఎట్టిపరిస్థితుల్లోనూ చంద్రబాబు ఫోన్ కు రెస్పాండ్ అవ్వొద్దని అంటున్నారంట. మరికొంతమందైతే… నువ్వు బయటకు వెళ్లినా పర్లేదు కానీ.. చంద్రబాబును మాత్రం కలపొద్దని కాస్త బేస్ వాయిస్ లోనే హెచ్చరిస్తున్నారంట. దీంతో… రేవంత్ కూడా ఆ సాహసం చేయడానికి సిద్ధంగా లేడన్నట్లుగా స్పందించాడని సమాచారం!!