మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి మీద పోలీసు కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట జరిగిన కార్యక్రమంలో రేవంత్ అనుచరుడైన తోటకూర జంగయ్య యాదవ్ ను ఇక్కడికి ఎవడు రమ్మన్నడు బే అంటూ లక్ష్మారెడ్డి తిట్టారు. తనను తిట్టి, బెదిరించిన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి మీద చర్యలు తీసుకోవాలని జంగయ్య యాదవ్ కీసర పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
వందల మంది కాంగ్రెస్ కార్యకర్తల మధ్య లక్ష్మారెడ్డి అసభ్య పదజాలంతో తనను తిట్టారని, ఆయనపై తక్షణమే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని జంగయ్య యాదవ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘట్ కేసర్ సర్పంచ్ అబ్బసాని యాదగిరిని సస్పెండ్ చేసిన నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు యాదగిరిపై సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ గురువారం మేడ్చల్ కలెక్టరేట్ వద్ద ధర్నా జరిగిన విషయం తెలిసిందే. ఈ ధర్నాలోనే కెఎల్ఆర్ నోరు పారేసుకున్నారు. ఆయన తిట్టిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వీడియో కింద ఉంది చూడండి.
కెఎల్ఆర్ కు మేడ్చల్ సీటు గల్లంతవుతుందన్న భయంతోనే స్థాయి దిగజారి తమ నాయకుడిని తిట్టారని జంగయ్య యాదవ్ అనుచరులు ఆరోపిస్తున్నారు. జంగయ్య యాదవ్ ఫిర్యాదు మేరకు కీసర సిఐ సురేందర్ గౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు. జంగయ్య యాదవ్ సమర్పించిన వీడియో పుటేజీని, ఫొటోలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ నేతలు టికెట్ల పోరాటం మొదలు పెట్టినట్లు కనబడుతున్నది. గతంలో ఎమ్మెల్యేగా రెండుసార్లు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పనిచేశారు. ఈసారి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డితోపాటు టిడిపిలో ఉన్న గ్యాంగ్ అంతా గత కొంత కాలం కిందట కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. రేవంత్ తో పాటు కాంగ్రెస్ లో చేరిన వారిలో తోటకూర జంగయ్య యాదవ్ కూడా ఉన్నారు. రాహుల్ సమక్షంలో వీరంతా పార్టీలో చేరారు.
ఈ పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో టికెట్ ఎవరికి ఇస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అందుకే ఇరువురు బల నిరూపణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో తోటకూర జంగయ్య యాదవ్ కు కెఎల్ ఆర్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయని, ఈసారి ఆయనకే టికెట్ వస్తదన్న అక్కస్సుతోనే కెఎల్ ఆర్ తిట్ల దండకం అందుకున్నారని జంగయ్య అనుచరులు అంటున్నారు. ఈసారి కేఎల్ ఆర్ పార్లమెంటుకు పోటీ చేస్తారన్న ప్రచారం జరిగినా, తాను ఇక్కడే అసెంబ్లీకి పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. పార్లమెంటుకు పోటీ ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో మేడ్చల్ రాజకీయం రంజుగా మారింది. మరి మేడ్చల్ పాలిటిక్స్ ఎటు దారి తీస్తాయో చూడాలి.