TG: సినీ నటుడు అల్లు అర్జున్ ని అరెస్టు చేయటాన్ని తెలంగాణ బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. మొదటినుంచి కూడా బండి సంజయ్ అల్లు అర్జున్ కు పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తూ ఈయన విషయంలో రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పుపడుతూ వచ్చారు.. ఇటీవల రేవంత్ రెడ్డికి పవన్ కళ్యాణ్ మద్దతు తెలియజేయడంతో పవన్ కళ్యాణ్ పై కూడా బండి సంజయ్ విమర్శలు చేశారు. అసలు ఏ కోణంలో మీకు రేవంత్ రెడ్డి గ్రేట్ అనిపించారు పవన్ కళ్యాణ్ గారు అంటూ ఈయన ప్రశ్నించారు.
ఇకపోతే తాజాగా మరోసారి అల్లు అర్జున్ విషయం గురించి బండి సంజయ్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పక్కదారి పట్టించడం కోసమే అల్లు అర్జున్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చారు. అల్లు అర్జున్ కు రేవంత్ రెడ్డికి మధ్య ఎక్కడో చెడింది. అందుకే పుష్ప 3 విడుదల కాకముందే అల్లు అర్జున్ కు రేవంత్ రెడ్డి సినిమా చూపించారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
తెలంగాణలో ముగ్గురు మంత్రులు పెద్ద ఎత్తున వసూలు రాబడుతున్నారని బండి సంజయ్ ఆరోపణలు చేశారు.సచివాలయం, మంత్రుల పేషీలు కమీషన్లకు అడ్డాగా మారాయని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. అలాగే.. తెలంగాణలో వసూలు చేసిన కమీషన్లతో ఢిల్లీకి కప్పం కడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉంది అయితే ఢిల్లీకి డబ్బులు పంపిస్తున్న నేపథ్యంలోనే రేవంత్ ముఖ్యమంత్రి పదవి నిలబడింది అంటూ ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి.