తెలంగాణ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు కొత్త మలుపులు కనిపిస్తున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని మరోసారి వేడెక్కించాయి. బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసేందుకు చర్చలు జరిగాయని ఆమె చేసిన ఆరోపణలపై బీజేపీ సీనియర్ నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఘాటుగా స్పందించారు. కవిత వ్యాఖ్యలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, “బీఆర్ఎస్ కుటుంబ గొడవల్లో బీజేపీని లాగేందుకు చేసిన యత్నం మాత్రమే” అన్నారు.
కవిత ప్రస్తుతం తన పార్టీలో తక్కువ విలువైన నేతగా మారిపోయారని రఘునందన్ ఎద్దేవా చేశారు. “పార్టీకి సంబంధించిన అంతర్గత సంక్షోభాలను బయటకు తెచ్చేందుకు ఆమె బీజేపీపై నిందలు వేస్తున్నారు. అయితే బీజేపీకి అలాంటి అవసరం ఏమాత్రం లేదు. కేంద్ర నాయకత్వం కానీ, రాష్ట్ర నేతలు కానీ ఎలాంటి చర్చలు జరపలేదు” అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఆమె వ్యక్తిత్వ హననం జరుగుతోందంటూ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు.
రఘునందన్ రావు తాను చేసిన ఆరోపణలు మరింత తీవ్రంగా ఉండటం విశేషం. కేటీఆర్ భారీ మొత్తంలో సోషల్ మీడియా టీమ్‌ను రన్ చేస్తున్నారని, దాదాపు 20 యూట్యూబ్ ఛానల్స్‌కు జీతాలు చెల్లిస్తున్నారని, తనపై తప్పుడు ప్రచారాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. “ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతున్న కుట్ర మాత్రమే” అని అన్నారు. దీనిపై సీఎం రేవంత్ స్పందించాలని, విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.