హైదరాబాద్: తెలంగాణలో పోలీసులు, బీజేపీ నేతల మధ్య చిన్నపాటి యుద్ధమే సాగుతోంది. గోవుల అక్రమ రవాణా అంశంపై మొదలైన వివాదం.. బీజేపీ నేతలు వర్సెస్ పోలీసుల వ్యవహారంగా మారింది.తెలంగాణ రాష్ట్ర పోలీసులపై బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులను ప్రభుత్వ తొత్తులని అభివర్ణించారు. ప్రమోషన్ల కోసం, మెహర్బానీ కోసం కొంతమంది పోలీసులు ప్రభుత్వ తొత్తులుగా మారిపోయారని ఆరోపించారు. ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు లేకపోలేదు.
తెలంగాణలో గోవుల అక్రమ రవాణా అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ… తెలంగాణలో గోవధపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. తాము పోలీసు వ్యవస్థకు వ్యతిరేకం కాదన్న ఆయన.. ప్రభుత్వానికి తొత్తులుగా మారిన పోలీసులకు మాత్రమే వ్యతిరేకం అని స్పష్టం చేశారు. గోవధపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.గోవులు హిందువుల ఆరాధ్య దైవం అని, గోవులను వధిస్తే చూస్తూ ఊరుకోబోమని బండి సంజయ్ హెచ్చరించారు. రాష్ట్రంలో పోలీసులు చేయలేని పనిని రాజాసింగ్ చేసి చూపిస్తున్నారని సంజయ్ వ్యాఖ్యానించారు.