తెలంగాణ: దుబ్బాకలో నవంబర్ 3న ఉప ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ తరఫున రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత, కాంగ్రెస్ పార్టీ తరఫున చెరుకు శ్రీనివాస్ రెడ్డి బరిలో ఉన్నారు.అయితే రోజులు దగ్గర పడుతున్న కొద్దీ దుబ్బాకలో రాజకీయం వేడెక్కిపోతుంది.
దుబ్బాక ఉప ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పట్టణంలో బీజేపీ ప్రచారం ముమ్మరం చేసింది. ఈ రోజు క్యాంపెయిన్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా “మాజీ మంత్రి బాబు మోహన్” ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణ చౌరస్తా వద్ద బాబూ మోహన్ మాట్లాడుతూ దుబ్బాక అభివృద్ధిలో వెనుకబడి పోయిందన్నారు. అందుకు ఉదాహరణ కూడా చెప్పారు. స్థానిక బస్టాండ్ చూసినట్లయితే శిధిలావస్థలో కనబడుతుందన్నారు. అభివృద్ధి అంటే ఇదేనా మొన్నటిదాకా టిఆర్ఎస్ లో ఉండి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని అభివృద్ధి చేస్తానంటూ తిరుగుతున్న కాంగ్రెస్ అభ్యర్థి మళ్లీ ఎన్నికలు అయిపోగానే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారని అనుమానం వ్యక్తం చేశారు. మంత్రి హరీష్ రావుకు సిద్దిపేట ఒక కన్ను దుబ్బాక ఒక కన్ను అయితే, గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల తరహాలో దుబ్బాక ఎందుకు అభివృద్ధి జరగడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల ముందు హరీష్ రావు హడావిడి చేస్తున్నారని, ఎన్నికల తర్వాత మళ్లీ ఇదే హడావిడి ఉంటుందా అని ప్రశ్నించారు.
దుబ్బాకలో అభివృద్ధి పేరుమీద టూత్ పాలిష్ చేస్తున్నారని బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. ఇన్ని రోజులు లేని అభివృద్ధి ఎన్నికల ముందు గుర్తుకొచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. సిద్దిపేటలో ఒక బీజేపీ కౌన్సిలర్ ఉన్నారని, ఆ ఏరియా లో పింఛన్ కట్ చేశారా అని ప్రశ్నించారు. పెద్ద ఉండవెల్లి గ్రామంలో ఎంపీటీసీ ఉన్నారని, ఆ ఊర్లో పింఛన్ కట్ అయిందా అని రఘునందన్ రావు ప్రశ్నించారు. దుబ్బాకలో బీజేపీ గెలిస్తే పెన్షన్ కట్ కాదని స్పష్టం చేశారు. కేవలం ఆ పేరుతో టీఆర్ఎస్ పార్టీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందన్నారు. ఎవరు ఎన్నిభయభ్రాంతులకు గురి చేసిన భయపడేది లేదన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చే నిధుల్లో సగానికి సగం కేంద్రం ఇస్తున్న నిధులేనని రఘునందన్ రావు అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి సవాల్ విసిరే హర్హత హరీశ్ రావుకు లేదన్నారు. ‘నీతో (హరీశ్ రావు) చర్చకు నీకు నేను సరి పోతా. ఎక్కడికి రమ్మంటావు? తెలంగాణ చౌరస్తా? బస్టాండ్? ఎక్కడైనా చర్చకు నేను సిద్ధమే.’ అని రఘునందన్ రావు సవాల్ విసిరారు.
విద్యుత్ సబ్ స్టేషన్ లకు ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో పీకేశారని, స్టేషన్లకు వచ్చే నిధులలో కేంద్రానివి లేవా అని ప్రశ్నించారు. గద్వేల్ కు రైలు వస్తుంది, సిద్దిపేట కు రైలు వస్తుందంని హరీశ్ రావు అంటున్నారని, మరి దుబ్బాకకు ఎందుకు రాదని ప్రశ్నించారు. దుబ్బాక ప్రజలు ఓట్లు వేయలేదా అని నిలదీశారు. దుబ్బాక నుంచి ఒకసారి తనకు అవకాశం ఇస్తే దుబ్బాకకు రైలు తీసుకొస్తానని, అభివృద్ధి చేసి చూపిస్తానని రఘునందన్ రావు అన్నారు.