BJP: తప్పక గెలవాల్సిన ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దుబ్బాక వేరు, హుజూరాబాద్ వేరు.. మునుగోడు వేరు.! ఒకదానితో ఒకటి పొంత లేని ఈ మూడు ఉప ఎన్నికల్లో రెండింటిని బీజేపీ గెలుచుకుంది. మూడో దాంట్లో ఓడిపోయింది. నిజానికి, నాగార్జునసాగర్‌తో కలుపుకుంటే మొత్తంగా రెండు గెలిచి, రెండు ఓడింది బీజేపీ.!
సరే, రాజకీయాల్లో గెలుపోటములు సహజం. నాగార్జున సాగర్ కథ వేరు. మునుగోడు వ్యవహారం వేరు. మునుగోడులో బీజేపీ అనూహ్యమైన రీతిలో ఖర్చు చేసింది. గెలిచేస్తున్నాం.. అనే ధీమాతో వుంది బీజేపీ. తెలంగాణ రాష్ట్ర సమితి ఓటమి ఖాయమనీ చాలామంది అనుకున్నారు.
ఎక్కడో తేడా కొట్టింది. అదెక్కడ.? అన్నదానిపై బీజేపీకి స్పష్టత లేదు. పోల్ మేనేజిమెంట్‌లో బోల్తాకొట్టేశామనే భావన బీజేపీలో వుంది. అదీ నిజం కాదు. బాగానే జరిగింది పోల్ మేనేజిమెంట్. కాకపోతే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుల్లోనే కొందరు చివరి నిమిషంలో చేతులెత్తేశారు. దాంతో, పంపకాలు సరిగ్గా జరగలేదు. అదే రాజగోపాల్ రెడ్డి ఓటమికి కారణంగా చెబుతున్నారు.
కొందరు మహిళా ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దనే మీడియాతో మాట్లాడుతూ, ‘రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు తప్పించుకుంటాడేమో.. కానీ, ఇంకో ఏడాదిలో వస్తాడు కదా.. అప్పుడు చెప్తాం..’ అంటూ నిష్టూరాలాడారు. అంటే, వారికి హామీ ఇచ్చి, కొందరికి చెల్లింపులు చేసి, మిగతావార్ని పక్కన పెట్టారన్నమాట.
బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి రావాల్సిన స్థాయిలో ప్రచారం పరంగా మద్దతు రాలేదనీ రాజగోపాల్ రెడ్డి తన ఓటమికి కారణాలపై విశ్లేషించుకుంటున్నారట. మరోపక్క డ్యామిట్ కథ అడ్డం తిరిగింది.. అని తెలంగాణ బీజేపీ నాయకత్వం తలపట్టుక్కూర్చుంది.