ఈ గ్రేటర్ ఎన్నికలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొత్త నాయకుడిగా అవతరించారు. బండి సంజయ్ పేరు ఢిల్లీ స్థాయిలో మోగిపోతోంది. నేరుగా ప్రధాని మోదీయే ఫోన్ చేసి అభినందనలు తెలిపారంటే చిన్న విషయం కాదు. త్వరలోనే ఆయన ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలవనున్నారు. వరుస ఎన్నికల క్రమంలో అధికార తెరాసను బండి సంజయ్ ఢీకొట్టిన విధానం ఒక సాహసమనే అనాలి. మాటకు మాటే కాదు చర్యకు ప్రతిచర్య కూడ చూపించారు. గ్రేటర్ సమరంలో బండి సంజయ్ నుండి ఈ లెవల్ ఫైట్ వస్తుందని కేసీఆర్ సైతం ఊహించలేకపోయారు. లేకపోతే 4 స్థానాలు ఎక్కడ 48 స్థానాలు ఎక్కడ. దాదాపు 11 రెట్లు బలం పెరిగింది బీజేపీకి. ఈ ఊపుతోనే తర్వాతి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి రూట్ మ్యాప్ వేసుకుంటున్నారు.
అయితే ఇంతలా అధికార పార్టీని బెంబేలెత్తించిన బండి సంజయ్ ఏఐఎంఐఎం పార్టీని మాత్రం టచ్ చేయలేకపోయారు. బండి ఎఫెక్ట్ ఎంఐఎం ఓటు బ్యాంకు మీద కొంచెం కూడ పనిచేయలేదు. గత ఎన్నికల్లో 44 స్థానాలను కైవసమా చేసుకున్న మజ్లిస్ ఈసారి కూడ అన్నే స్థానాలను గెలిచి మరోసారి గ్రేటర్ మీద తమకున్న పట్టు ఎంత గట్టిదో చాటుకుంది. నిజానికి భాజపా తెరాసతో పాటు మజ్లిస్ పార్టీని కూడ సమానంగా టార్గెట్ చేసింది. చార్మినార్ ప్రాంతంలో బండి సంజయ్ చేసిన హడావిడే అందుకు నిదర్శనం. సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తామని, జూతే కె నీచే లగాతుమ్ అంటూ మాటల తూటాలు పేల్చారు కషాయ నేతలు. కానీ అవేవీ పనిచేయలేదు. పైపెచ్చు రివర్స్ అయ్యాయి కూడ. ఒక్కసారి ఎంఐఎం అభ్యర్థులు సాధించిన ఓట్ల మెజారిటీ చూస్తే ఆ సంగతి అర్థమవుతుంది.
ఎంఐఎం పోటీచేసిన చాలా చోట్ల ప్రధాన అభ్యర్థులుగా నిలబడింది బీజేపీ అభ్యర్థులే. వాళ్లలో చాలామందికి డిపాజిట్లు కూడ దొరకలేదు. ఈ ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో మెజారిటీ సాధించిన విజేతలంతా ఎంఐఎం విజేతలే. పత్తర్ ఘట్టిలో 18,909 ఓట్లు ఆధిక్యం, శాలిబండలో 10,194, దత్తాత్రేయ నగర్లో 10,374, అహ్మద్ నగర్లో 11,372, చాంద్రాయణగుట్టలో 16,733, రియాసత్ నగర్లో 16,166, ఉప్పుగూడలో 8007, బార్కాస్ నందు 11,667, కంచం బాగ్లో 16,441, సులేమాన్ నగర్లో 12,972, శాస్త్రీపురంలో 10,619, తలాబ్ చంచలంలో 17,453, డబీర్ పురలో 10,924, ఫలక్ నుమాలో 17,283, గోల్కొండలో 17,250, నానల్ నగర్లో 18,864, లలితా బాగ్ నందు 8,232 ఇలా ఇంకా 10 చోట్ల ఎంఐఎం అభ్యర్థులు వీరవిహారం చేశారు. వారి ముందు భాజపా,తెరాస అభ్యర్థులు కనీసం పోటీ ఇచ్చినట్టు కూడ కనబలేదు. ఈ మెజారిటీ చూస్తే బీజేపీ, బండి సంజయ్ మంత్రాలు ఎంఐఎం హవా ముందు అస్సలు పనిచేయలేదని స్పష్టంగా తెలుస్తోంది.