తెలంగాణ కానిస్టేబుల్ నియామక ప్రక్రియ మరింత ఆలస్యమయ్యేలా ఉంది. తెలంగాణలో కానిస్టేబుల్ , ఎస్పై ఉద్యోగాలకు ప్రాథమిక పరీక్ష నిర్వహించి ఫలితాలు విడుదల చేశారు. దేహధారుడ్య పరీక్షలకు షెడ్యూల్ ప్రకటించినా అంతలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. దీంతో అవి వాయిదా పడ్డాయి. ఇంతలోనే కానిస్టేబుల్ నియామక ప్రాథమిక పరీక్షలో పలు తప్పులు ఉన్నాయని కోర్టులో పిటిషన్ వేశారు. విచారించిన కోర్టు వాటిని సవరించి మెరిట్ జాబితాను ప్రకటించాలని తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డును ఆదేశించింది.
ఇప్పటి వరకు కూడా పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు మెరిట్ జాబితాను ప్రకటించలేదు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అవి ముగిసిన నెలరోజులలోనే పార్లెమెంటు ఎన్నికల నోటిఫికేష్ విడుదల కానుంది. దీంతో పోలీస్ సిబ్బంది అంతా ఎన్నికల డ్యూటిలో ఉండనున్నారు. ఇక ఫిట్ నెస్ టెస్టులు నిర్వహించాలంటే 45 రోజుల సమయం పట్టనుంది. ఇప్పట్లో ప్రారంభిస్తే సమస్యలు వచ్చే అవకాశం ఉందని పార్లమెంటు ఎన్నికల తర్వాతనే ఫిట్ నెస్ టెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీస్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ప్రాథమిక ఫలితాలు వచ్చి 3 నెలలు గడుస్తున్నా తదుపరి ప్రక్రియ ప్రారంభించని పోలీస్ బోర్డు పై అభ్యర్దులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోర్డు ఆదేశాలు వచ్చి నెలలు గడుస్తున్నా మెరిట్ జాబితా తయారు చేయకపోవడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు ముగిసి కూడా నెలరోజులు అవుతుందని అప్పటి నుంచి ప్రారంభిస్తే ఈ లోగా ఫిట్ నెస్ పరీక్షలు పూర్తయ్యేవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ సమస్య వచ్చిందని వారంటున్నారు. పంచాయతీ ఎన్నికలు జనవరి 30 న ముగుస్తున్నందున అవి ముగిసిన వెంటనే దేహధారుడ్య పరీక్షలు పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలు మే లేదా జూన్ నెలలో జరగనుండడంతో ఈవెంట్లు నిర్వహించేందుకు సమయం ఉందని వెంటనే బోర్డు ఈవెంట్స్ తేదిలను ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
పోలీస్ నియామక ప్రక్రియ పై పలువురు అభ్యర్దులు తెలుగురాజ్యం తో మాట్లాడారు. వారు ఏమన్నారంటే
మాది నల్లగొండ జిల్లా మునుగోడు. నేను మూడు సంవత్సరాలుగా కానిస్టేబుల్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాను. చివరి నోటిఫికేషన్ లో 0.5 మార్కుల తేడాతో నేను ఉద్యోగం కోల్పోయాను. దీంతో ఎలాగైనా ఉద్యోగం కొట్టాలని కసితో మళ్లీ ప్రిపేర్ అవుతున్నాను. మాది మధ్య తరగతి కుటుంబం. అయినా కూడా పోలీస్ కావాలనే లక్ష్యంతో ప్రిపేర్ అవుతున్నా. ప్రభుత్వం ప్రతిసారి లేట్ చేయడంతో విరక్తి వస్తుంది. హైదరాబాద్ లో రూంలో ఉండి చదువుకుంటున్నాను. నియామక ప్రక్రియ ఇంకా ఆలస్యం అవుతుండడంతో అప్పుడప్పుడు ఊరికి వెళ్లి నాన్నకు వ్యవసాయ పనులల్లో సాయపడుతున్నాను. నాలాగా ఎంతో మంది తిని తినక ప్రిపేర్ అవుతున్నారు. వారిని మానసికంగా ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం వెంటనే నియామక ప్రక్రియ జరిగేలా చూడాలి.
వెంకన్న, ఎల్ బీ నగర్
మాది నల్లగొండ జిల్లా హలియా. నేను కూడా కానిస్టేబుల్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాను. పోలీస్ కావాలని నా ఆశయం. చివరి సారి పరీక్షలో 2 మార్కులతో ఉద్యోగం కోల్పోయాను. ఈ సారి సాదించాలనే పట్టుదలతో ప్రిపేర్ అవుతున్నాను. ప్రైవేట్ జాబులు ఎన్ని వచ్చినా చేయకుండా చదువుతున్నాను. కుటుంబానికి భారంగా మారానన్న భావనతో బాధపడుతున్నాను. ప్రభుత్వం వెంటనే నియామక ప్రక్రియ ప్రారంబించాలి. అనేక మంది ఇంటికి వెళ్లలేక హైదరాబాద్ లో ఉంలేక ఇబ్బంది పడుతున్నారు.
శ్రీకాంత్, కొత్తపేట.