ములుగు జిల్లాలో దారుణం… రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భార్యాభర్తలు అనాధలుగా మారిన పిల్లలు!

రోడ్డు ప్రమాదాలను అరికట్టటానికి పోలీసులు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ రోజు రోజుకి రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతిరోజు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి కుటుంబ సభ్యులకు దీవెనని లోటును మిగులుస్తున్నారు. వాహనాలు నడిపేవారి అజాగ్రత్త , నిర్లక్ష్యం కారణంగా ఎంతో మంది పసిపిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మిగులుతున్నారు. ఇటీవల ములుగు జిల్లాలో
ఇటువంటి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తల్లితండ్రులు ఇద్దరు మరణించగా పసిపిల్లలు మాత్రం అనాధలుగా మిగిలిపోయారు.

వివరాలలోకి వెళితే…ములుగు జిల్లా వాజేడు మండలం చింతూరులో నివసిస్తున్న తోటపల్లి రమేష్‌ (43), స్వరూప (40) దంపతులకు ఇద్దరు కుమారులు. వ్యవసాయం చేస్తూ వీరు జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారులలో ఒకరు ఇంటర్ చదువుతుండగా.. మరొక కుమారుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం ఉదయం దేవుడి ప్రార్ధన కోసం ఇంటి నుండి ద్విచక్ర వాహనంపై పాయబాట్ల గ్రామంలోని చర్చికి బయలుదేరిన వీరిద్దరూ సుందరయ్య కాలనీ దగ్గరకి చేరుకోగానే వరంగల్ నుండి చింతూరుకు ఇసుక కోసం వెళ్తున్న లారీ వేగంగా వచ్చి వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం లారీ చక్రాల కింద ఇరుక్కుపోయి దాదాపు 30 మీటర్ల వరకు వీరిద్దరిని ఈడ్చుకెళ్ళింది. లారీ డ్రైవర్ అక్కడి నుండి పరారయ్యాడు. ఇలా లారీ కింద ఇరుక్కుపోయిన వీరిద్దరూ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాల గురించి స్థానికులను విచారించారు. అయితే ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ని ఇప్పగూడెం దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకొని అతని మీద కేసు నమోదు చేసుకొని రిమాండ్ కి తరలించారు. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులు మరణించడంతో ఇద్దరు కుమారులు అనాధలుగా మిగిలిపోయారు. ఈ దంపతుల మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.