తెలంగాణ: దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు చేదు అనుభవం ఎదురైంది. దుబ్బాక మండలం అప్పన్ పల్లి గ్రామంలో మంత్రి హరీశ్ రావును స్థానికులు అడ్డుకున్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన వారికి న్యాయం చేయడంలో వివక్ష చూపారని ఆరోపించారు. గజ్వేల్, సిద్దిపేట భూనిర్వాసితులకు లక్షల రూపాయలు అందించిన హరీశ్ రావు తమకు మాత్రం కేవలం వేల రూపాయలు చెల్లించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ గ్రామానికి రావడంతో స్థానికులు హరీశ్ రావును నిలదీశారు. అదే సమయంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చారు. దీంతో మంత్రి హరీశ్ రావు అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లిపోయారు.
మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలు టీఆర్ఎస్, కేసీఆర్ వైపే ఉన్నారని, వారిని తమ పార్టీ కడుపులో పెట్టుకొని చూసుకుంటుందని ఇటీవల మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ముంపు బాధితులకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి 70 శాత నష్టపరిహారం అందిందని.. ఎన్నికలు వచ్చిన్నప్పుడే ప్రతిపక్షాలకు ముంపు బాధితులు గుర్తుకు వస్తారని ఆయన మండిపడ్డారు. రామలింగారెడ్డి వైపే ప్రజలు ఉన్నారని హరీశ్ అన్నారు. దుబ్బాక అభివృద్ధిలో వెనుక బడిందని ప్రతిపక్షాలు అనడం విడ్డూరమని.. ప్రతిపక్షాలకి ఉప ఎన్నికల్లో చెప్పుకోవడానికి ఏమి లేదు కాబట్టి, ఇలాంటి కాయకొరుకుడు మాటలు మాట్లాడుతున్నారని హరీశ్ ఎద్దేవా చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని మంత్రి మరోసారి ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు దుబ్బాక లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును గెలిపిస్తే మల్లన్న సాగర్ నిర్వాసితులును తీసుకుని వెళ్లి వారం రోజుల్లో ప్రగతి భవన్ ముందు కూర్చుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ ఫలితమే దుబ్బాక లో వస్తుందన్నారు. రేషన్ బియ్యం లో బీజేపీ రూ.29 ఇస్తుందని చెప్ాపరు. అలాగే రూ.1500 కోట్లతో రెండు లక్షలు ఇళ్ళు ఇచ్చామన్న బండి సంజయ్, పింఛన్ల విషయంలో టీఆర్ఎస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇంట్లో ఇద్దరికి పింఛన్ ఇవ్వాల్సిందే అని స్పష్టం చేశారు. ప్రస్తుతం దుబ్బాక వైపు రాష్ట్రమంతా చూస్తోందన్నారు.
నవంబర్ 3న దుబ్బాక ఉప ఎన్నికలు జరగనున్నాయి. టీఆర్ఎస్ పార్టీ తరఫున రామలింగారెడ్డి సతీమణ సుజాత పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున చెరుకు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం దుబ్బాకలో రఘునందన్ రావు బంధువు నివాసంలో డబ్బులు పట్టుబడడం పెద్ద సంచలనంగా మారింది. ఆ సమయంలో కొందరు బీజేపీ కార్యకర్తలు పోలీసుల మీద దాడి చేసి పట్టుబడిన నగదులో కొంత ఎత్తుకుపోయారని కూడా టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ అంశం తెలంగాణలో పెద్ద దుమారం రేగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీద కూడా దాడి జరిగింది. ఈ అంశం పెను సంచలనంగా మారింది