Hyderabad: హైదరాబాద్ లో మరో ఫ్లైఓవర్ రెడీ: ఐటీ కారిడార్ ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం!

హైదరాబాద్ నగరానికి చెందిన వాహనదారులకు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఔటర్ రింగ్ రోడ్ నుంచి నేరుగా కొండాపూర్ వరకు వేగంగా వెళ్లేలా నిర్మిస్తున్న మల్టీ లెవెల్ ఫ్లైఓవర్‌ పనులు తుదిదశకు చేరుకున్నాయి. జూన్ మొదటి వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ ఫ్లైఓవర్ ప్రారంభమైతే, గచ్చిబౌలి జంక్షన్ వద్ద రోజూ ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించనుంది. వాహనదారులకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోవడంతో పాటు, ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్‌లో ప్రయాణం కష్టతరంగా మారిన సమస్యకూ పరిష్కారం కనిపించనుంది. వాహనదారులకు ట్రాఫిక్ లైట్లు, సిగ్నళ్ల అడ్డంకులు లేకుండా నేరుగా గమ్యస్థానాలకు చేరుకునే వీలవుతుంది.

ఔటర్ రింగ్ రోడ్ నుంచి వచ్చే వారు హఫీజ్‌పేట్, కొండాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్ వంటి కీలక ప్రాంతాలకు ఈ వంతెన ద్వారా మరింత వేగంగా వెళ్లగలుగుతారు. అదే విధంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ ప్రాంతాలకు చేరుకునేవారికి ఇది మరింత అనుకూలంగా మారనుంది. ఇప్పటికే ట్రాఫిక్ భారంతో ఇబ్బందిపడుతున్న ఈ మార్గం ఇప్పుడు వాహనదారులకు ఊరటనివ్వనుంది.

ప్రభుత్వం తరఫున మౌలిక సదుపాయాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్నామని అధికారులు తెలిపారు. త్వరలోనే ఈ వంతెన అందుబాటులోకి రానుండటంతో, టెక్ కారిడార్‌ మొత్తం ప్రయాణానికి మరింత వేగం, స్థిరత కలిగించనుందని వాహనదారులు ఆశిస్తున్నారు.