తెలంగాణ రాష్ట్రం.. అందునా హైదరాబాద్ నగరం ఇప్పుడు కరోనా భయంతో వణికిపోతోంది. కరోనా పాజిటివ్ వ్యక్తి నివసించిన ప్రాంతంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అలాగే విదేశీయుల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో స్థానికులు బైటికి రావాలంటేనే భయపడుతున్నారు.
సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చూస్తే హైదరాబాద్ ప్రజలు ఎంతగా భయపడిపోతున్నారో తెలుస్తోంది. ఓ వ్యక్తి ఓ రెస్టారెంట్ కి వెళ్లిన సందర్భంగా చేసిన పోస్ట్ ఇది.. అందులో ”నేను వెళ్లిన దగ్గర ఓ విదేశీ వ్యక్తి వచ్చాడు. అయితే అతన్ని చూసి అక్కడ ఉన్న వాళ్లందరూ దూరంగా జరుగుతున్నారు. అతను చైనా వాడిలా అనిపించడం వల్లనేమో కొందరైతే ఎంట్రెన్స్ నుండే అతన్ని చూసి బైటికి వెళ్లిపోతున్నారు. పాపం అందరూ అతన్ని అలా చూడటం గమనించి పరిస్థితి అర్థం చేసుకున్నాడేమో అతనే వెళ్లిపోవడానికి చూశాడు.” అంటూ తన చుట్టూ జరిగిన విషయాన్ని పంచుకున్నాడు. దీన్ని చూస్తేనే అర్థమవుతోంది హైదరాబాద్ ప్రజలు కరోనాకి ఎంత హడలిపోతున్నారు అనేది.
ఇటలీ నుండి వచ్చిన ఓ మహిళ కొంపల్లిలోని ఓ హోటల్ లో బస చేసినట్లు తెలుసుకున్న స్థానికులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పరిస్థితి ఏంటని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. అయితే ఈ భయాలను పోగొట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు మాత్రమే నమోదైనప్పటికీ ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో పెద్ద ఎత్తున కరోనా ట్రీట్ మెంట్ కోసం రంగం సిద్ధం చేసింది. ఎన్ని చేసినా కరోనా భయం మాత్రం ఇప్పట్లో ప్రజల మనసుల నుండి తొలగేలా లేదు.