తెలంగాణలో కోవిడ్-19 తొలి మరణం నమోదైంది. నాంపల్లికి చెందిన 74 ఏళ్ల వృద్ధుడు మరణించిన అనంతరం.. చేసిన పరీక్షల్లో అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది. పెద్ద వయసు కాబట్టి కరోనా వైరస్ నుండి కోలుకోలేక మరణించి ఉంటాడు అని సరిపెట్టుకుంటే.. పెద్ద పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఈ మరణం వెనుక చాలా పెద్ద స్టోరీనే ఉంది. అసలు వాస్తవాలు చూస్తే వణుకు పుడుతుంది.
మార్చి 14న ఢిల్లీలో జరిగిన ఓ మత కార్యక్రమానికి వృద్ధుడు అక్కడికి వెళ్లారు. అక్కడే ఆయనకు కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. అయితే ఎవరి ద్వారా వైరస్ వ్యాపించింది, అక్కడ ఇంకా ఎంత మందికి సోకింది అనేది తెలియదు. అంటే ఇప్పటి వరకు రెండో దశలోనే ఉన్నాం అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు కరోనా మూడో దశలోకి చేరుకున్నాం అని ఈ మృతి ద్వారా స్పష్టమవుతోంది. అలాగే ఇది ఎంత మందికి వ్యాపించి ఉండవచ్చు, వారు ఎవరెవరిని కలిశారు వంటి అంశాలేవీ తెలియలేదు. ఇక మృతి చెందిన వ్యక్తి వివరాలను చూస్తే.. ఢిల్లీ నుంచి 17వ తేదీన రైల్లో హైదరాబాదు వచ్చాడు అతను. ఆ రైల్లో ఎందమందిని కాంటాక్ట్ అయ్యాడు, ఏ స్టేషన్లో దిగాడు, ఎక్కడ తిన్నాడు, ఆ ప్రయాణంలో ఎంత మందికి వైరస్ సోకి ఉండవచ్చు ఇలాంటి ప్రశ్నలు వందలు ఉత్పన్నం అవుతున్నాయి.
అది ఓ పెద్ద చక్రవ్యూహం అయితే.. సదరు వ్యక్తి అనారోగ్యంతో తొలుత ఓ ప్రైవేట్ హాస్పటల్‌లో చేరాడు. కరోనా వ్యక్తిగా కాకుండా సాధారణ రోగిగా ట్రీట్ మెంట్ చేయడం వల్ల ఆ సమయంలో ఎంత మందికి సోకింది, మరణించిన తర్వాత కూడా ఆయన బంధువులు మరో ఆస్పత్రికి తీసుకెళ్లడం ఈ ప్రాసెస్ మొత్తం చూస్తే.. మరణించిన వ్యక్తి ఎంత మందికి కాంటాక్ట్ అయ్యారు, ఎంత మందికి వైరస్ సోకి ఉండవచ్చు వంటివి అసెస్ చేయడం అనేది ఓ పెద్ద చిక్కుముడిగా మారిపోయింది.