ఆ జిల్లాపై కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి ఎందుకు పెట్టినట్లు..?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఓ జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇందుకోసం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారట. పట్టు కోల్పోయిన చోటే మళ్లీ పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్నారట.. ఇంతకీ ఆ జిల్లా.. ఏంటీ.. ఎందుకు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు అంటే..?

లోక్ సభ ఎన్నికల్లో కవిత ఓడిపోయిన నిజామాబాద్ జిల్లాపై ఆ తర్వాత టీఆర్ఎస్ పెద్దగా ఫోకస్ పెట్టలేదనే టాక్ వినిపించింది. అదే అదనుగా.. కవితపై ఎంపీగా గెలిచిన బీజేపీ నేత ధర్మపురి అరవింద్ పార్టీ బలోపేతం అయ్యేలా చర్యలు చేపట్టారు. నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ 28 కార్పొరేటర్లను గెలుచుకునే స్థాయికి తీసుకెళ్లారు.

అయితే తాజాగా నిజామాబాద్‌లో ఎంఐఎంతో కలిసి మేయర్ సీటును దక్కించుకున్న టీఆర్ఎస్ మళ్లీ నిజామాబాద్ జిల్లాపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. దానికోసమే కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారని ఆ జిల్లా టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అందులో భాగంగానే రాజ్యసభ సభ్యుడిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన సురేశ్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వడం, కవితను అక్కడి నుండే ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలపడం చేశారని టాక్. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో మళ్లీ పట్టు సాధించేందుకు.. కేసీఆర్ పావులు కదుపుతున్నట్లు అర్థమవుతోంది.