తెలంగాణ సీఎం కేసీఆర్‌కి కోపం వచ్చింది.. ప్రజలను ఆందోళనకు గురిచేసే వారి పట్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది.. ఇంకేముంది.. అలాంటి వాళ్లను ఏం చేస్తానో చూడండని హెచ్చరించారు. పైగా వాళ్లకు కరోనా రావాలని శాపం కూడా పెట్టారు.
ఇంతకీ కేసీఆర్‌కు అంత కోపం తెప్పించిన వాళ్లు ఎవరు అంటే.. సోషల్ మీడియా దుష్ప్రచారం చేసే వాళ్లు. కరోనా వైరస్ పై తప్పుడు ప్రచారాలు చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపైనే సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా ప్రచారం చేస్తున్న వారి పని పడతామని హెచ్చరించారు. అలా చేసే వాళ్లకు వాళ్లకు భయంకరమైన శిక్షలు విధిస్తామని చెప్పారు. అసలు ఆ శిక్షలు ఎలా ఉంటాయో తాను రుచి చూపిస్తానన్నారు. ఎంత దుష్ప్రచారం చేస్తారో, అంతకు వంద రెట్లు శిక్ష అనుభవిస్తారని కూడా పలికారు.
తనదైన పంథాలో విరుచుకుపడ్డ కేసీఆర్.. దిక్కుమాలిన, చిల్లర ప్రచారాలు చేసే వాళ్లకు అందరి కంటే ముందు కరోనా సోకుతుంది, సోకాలి కూడా ఆ దుర్మార్గులకు.. అలా అయితేనే వారికి కూడా తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుందో.. అంటూ శాపం కూడా పెట్టారు. ప్రజల మనోభావాలతో ఆడుకునే వాళ్లను ఎలాగైనా పట్టుకుంటామని, ఆ తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తానని అన్నారు. ఎంతైనా హెచ్చరికలు జారీ చేయడంలో కేసీఆర్ స్టైలే వేరు అని మరోసారి అనిపించుకున్నారు.