పృథ్వీ రాజీనామా పై క్లారిటీ…?

ఎస్వీబీసీ ఛైర్మెన్‌ పృథ్వీరాజ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఆడియో టేపుల వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న టీటీడీ.. పృథ్వీని తప్పుకోవాలని సూచించింది. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఎస్వీబీసీలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగినితో రొమాంటిక్‌గా మాట్లాడిన ఘటనలో.. పృథ్వీ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. సదరు మహిళతో కలిసి మద్యం తాగాలని ఉందని.. తనంటే ఇష్టమని.. తన గుండెల్లో ఉన్నావంటూ మహిళతో సరసం ఆడారు. ఈ ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వ్య‌వ‌హారాన్ని టీటీడీ చైర్మ‌న్ సుబ్బారెడ్డి, సీఎం జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వైసీపీ నుంచి ఆదేశాలు రావడంతో పృథ్వీ ఎట్టకేలకు రాజీనామా చేశారు. రాజీనామా విషయాన్ని మీడియా సమావేశంలో పృథ్వీ స్వయంగా వెల్లడించారు. ఏన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేశానని, పార్టీ అధ్యక్షుడి మాటను గౌరవించి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అసలా ఆడియోలో ఉన్న వాయిస్.. తనది కాదని తెలిపారు. అయితే ఆ ఆడియోకు తనకు ఎలాంటి సంబంధం లేదని.. తేల్చిచెప్పారు. కావాలనే తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని తనకు మహిళలంటే అపార గౌరవమని, ఇంతవరకు ఆడవారి పట్ల ఏ రోజూ అసభ్యంగా మాట్లాడలేదని చెప్పుకొచ్చారు.

టీటీడీ విజిలెన్స్‌ కూడా విచారణ చేపట్టింది. ఎస్వీబీసీ కార్యాలయంలో ఆయనను విచారించి.. పలువురు సిబ్బంది నుంచి వివరాలు సేకరించింది. మరోవైపు తనకు ఎస్వీబీసీ ఛైర్మెన్‌గా వచ్చిన అవకాశం చాలామందికి నచ్చడం లేదని, అందులో భాగంగానే తాజా ఆడియో టేపు లీకేజీ వ్యవహారం వచ్చినట్లు.. పృథ్వీరాజ్ చెబుతున్నారు. అలాగే రైతులందరినీ పెయిడ్‌ ఆర్టిస్టులని తాను అనలేదని చెప్పారు. ఫేక్‌ వాయిస్‌తో తనపై దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. దీనివల్ల తన కుటుంబం, స్నేహితులు ఎంతో బాధపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.