రచనారెడ్డి, స్వప్నారెడ్డి ఈ పేర్లు గల వ్యక్తులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం చేసింది ఎవరంటే తెలంగాణ సిఎం కేసిఆర్. నిన్నమొన్నటి వరకు రచనారెడ్డి, స్వప్నారెడ్డి ఎవరో పెద్దగా జనాలకు తెలియదు. రచనారెడ్డి అయితే అడ్వకెట్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో అడపాదడపా పాల్గొన్నారు. అయితే రెండేళ్ల కిందట ఆమె పెద్దగా ఎవరికీ పరిచయం లేదు. సిఎం కేసిఆర్ పుణ్యమా అని ఆమె ఇప్పుడు తెలంగాణలో టాప్ మోస్ట్ అడ్వకెట్ అయ్యారు. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సిఎం కేసిఆర్ అడ్వొకెట్ రచనారెడ్డిపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. రచనారెడ్డిని ఉద్దేశించి ముఠా అని ఘాటుగా తిట్టారు. తమ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అడ్డంపడుతున్నారని, కోర్టుల్లో కేసులు వేసి ప్రాజెక్టులు ముందుకు కదలకుండా చేస్తున్నారని రచనారెడ్డిపై అసెంబ్లీలో ఆక్రోశాన్ని వెల్లగక్కారు కేసిఆర్. కేసిఆర్ నోట రచనారెడ్డిపై విమర్శల వర్షం కురియడంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో రచనారెడ్డి స్టార్ అడ్వకెట్ అయిపోయారు. సామాన్య అడ్వకెట్ కాస్తా అసామాన్య అడ్వకెట్ అయిపోయారు. స్వయంగా సిఎం నోట ఆమె పేరు రావడంతో ఎవరా రచనారెడ్ది అని తెలుసుకునేందుకు జనాలు గూగుల్ లో తెగ సెర్చ్ చేశారు. నిన్నటి దాకా జెఎసి నాయకురాలిగా ఉన్న రచనారెడ్డి ఇప్పుడు తెలంగాణ జన సమితి నాయకురాలయ్యారు. కేసిఆర్ తో ఢీ అంటే ఢీ అంటున్నారు. రానున్న ఎన్నికల్లో ఆమె అసెంబ్లీకి పోటీ చేస్తారన్న ప్రచారం కూడా ఉంది. ఆమెకు ఇంత పాపులారిటీ రావడానికి కేసిఆరే కారణమని అందరూ అంగీకరిస్తున్నారు.
ఇక మరో మహిళ పేరును కేసిఆర్ తన నోటినుంచి ఉచ్ఛరించలేదు కానీ.. తెలంగాణ సిఎం ఆఫీసు నుంచి వచ్చిన అధికారిక ప్రకటనలో వెలువరించారు. ఆమె ఎవరంటే స్వప్నారెడ్డి. సిఎంఓ నుంచి వచ్చిన ప్రెస్ నోట్ లో స్వప్నారెడ్డి పేరు ఉందంటే ఆమె ఎంత పెద్ద నాయకురాలో అని అందరూ అనుకుంటారు. కానీ ఆమె అత్యంత సామాన్యమైన మహిళా నేత. మెదక్ జిల్లాలోని ఆంధోల్ నియోజకవర్గంలో ఒక చిన్న గ్రామానికి సర్పంచ్. అంత చిన్న గ్రామానికి సర్పంచ్ అయిన స్వప్నారెడ్డి పేరును ముఖ్యమంత్రి కార్యాలయం పలువరించిందంటే అందరూ నోరెళ్లబెడుతున్నారు. తెలంగాణ స్థానిక సంస్థల్లో బిసిలకు రిజర్వేషన్లు ఇచ్చుడు కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు. అందుకోసమే స్వప్నారెడ్డి అనే సర్పంచ్ చేత కేసులు వేయించింది అని సిఎం విమర్శించినట్లు ఒక ప్రకటన సిఎం ఆఫీసు నుంచి వెలువడింది. దీంతో ఎవరీ స్వప్నారెడ్డి అని జనాలు ఆశ్చర్యపోయి సెర్చ్ చేయడం మొదులు పెట్టారు. స్వప్నారెడ్డి సర్పంచ్ అని తేలడంతో మరి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆమె పేరు మీద ఎందకు ప్రకటన వచ్చింది..? కాంగ్రెస్ పార్టీని విమర్శించేందుకు స్వప్నారెడ్డి పేరును ముఖ్యమంత్రి ఎందుకు తీసుకున్నారు? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 50శాతానికి రిజర్వేషన్లు మించరాదన్న విషయమై స్వప్నారెడ్డి భర్త మధుసూదన్ రెడ్డి హైకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం స్థానిక సంస్థల్లో 50 శాతానికి రిజర్వేషన్లు మించకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో కేసు ఫైల్ చేశారు. ఈ కేసును పరిగణలోకి తీసుకున్న హైకోర్టు సిజె స్థానిక సంస్థల ఎన్నకల్లో 50 శాతం మించరాదంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో తెలంగాణ సర్కారు ఇరకాటంలో పడింది. అందుకే తెలంగాణ సిఎం తన ఆగ్రహాన్ని, ఆక్రోశాన్ని కాంగ్రెస్ మీద వెల్లగక్కారు. మధ్యలో కేసు వేసిన స్వప్నారెడ్డిని ఉటంకించారు. అయితే కేసిఆర్ కామెంట్స్ ను కాంగ్రెస్ పార్టీ బలంగా తిప్పికొట్టింది. స్వప్నారెడ్డి సైతం కేసిఆర్ కామెంట్స్ పై సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టులో కూడా ఫైట్ చేసి రిజర్వేషన్లు 50 శాతం దాటకుండా పోరాటం చేస్తానని అన్నారు. సర్పంచ్ స్వప్నారెడ్డి పేరును సిఎం ఆఫీసు ప్రస్తావించడంతో స్వప్నారెడ్డి పేరు తెలంగాణలో మారుమోగిపోతున్నది. నిన్న మొన్నటి వరకు ఒంటరి స్వప్నారెడ్డి అంటే ఎవరో తెలంగాణలో ఎవరికీ తెలియదు. ఆమె సంగారెడ్డి జిల్లాలోని ఆంధోల్ నియోజకవర్గంలోని పోసానిపేట గ్రామ సర్పంచ్. సర్పంచ్ గా ఆ గ్రామానికే తెలిసిన వ్యక్తి. మహా అంటే మండలంలో రాజకీయాలు అవగాహన ఉన్న వారికి పరిచయం ఉన్న పేరు. కానీ ఇప్పుడు స్వప్నారెడ్డి పేరు హాట్ టాపిక్ అయింది. ఏకంగా తెలంగాణ ఇంటలిజెన్స్ వర్గాలు కూడా ఎవరీ స్వప్నారెడ్డి అని ఎంక్వైరీ చేశారు.
మొత్తానికి తెలంగాణలో బలమైన సామాజికవర్గానికి చెందిన రచనారెడ్డి, స్వప్నారెడ్డి పేర్లను కేసిఆర్ ఉద్దేశపూర్వకంగా ప్రస్తావించారా? లేక యాదృచ్చికంగానే జరిగిందా అన్న చర్చ మొదలైంది. ఎందుకు ఆ సామాజికవర్గానికి చెందిన మహిళలపై సిఎం కేసిఆర్ విమర్శలు గుప్పించారన్నది మాత్రం జవాబు లేని ప్రశ్నగానే ఉంది.