ముందు నుయ్యి వెనుక గొయ్యి అని పురాతన సామెత ఒకటి మనం తరచుగా వింటూ ఉంటాం కదా. ఇప్పుడు తెలంగాణ సిఎం కేసిఆర్ పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఇటు చూస్తే తన గారాల పట్టి, నిజామాబాద్ ఎంపి కవిత, అటు చూస్తే తన చిరకాల స్నేహితుడు, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్. ఇద్దరి మధ్య వార కేసిఆర్ కు తలనొప్పిని తెప్పిస్తున్నది. అందుకే ఈ విషయంలో కేసిఆర్ ఇప్పటి వరకు ఏరకమైన నిర్ణయం తీసుకోలేకపోయారు. తీసుకోలేకపోవడమే కాదు.. తీసుకోలేరు అన్న వాదన కూడా రాజకీయ వర్గాల్లో వినబడుతున్నది. ఇంతకూ కవిత ఎందుకు ఆరోపణలు చేశారు? కేసిఆర్ ఎందుకు డిఎస్ మీద వేటు వేయలేకపోతున్నారు? వివరాల కోసం ఫుల్ స్టోరీ చదవండి.
తెలంగాణలోని అధికార టిఆర్ఎస్ పార్టీలో నిజామాబాద్ పాలిటిక్స్ కాక మీదున్నాయి. నిజామాబాద్ టిఆర్ఎస్ లో చీడ పురుగు గా రాజ్యసభ సభ్యుడ డి.శ్రీనివాస్ మారిపోయారని, తక్షణమే ఆయన మీద సస్పెన్షన్ వేటు వేయాలని ఎంపి కవిత నాయకత్వంలోని ఒక బృందం అధినేత కేసిఆర్ కు ఉత్తరం పంపింది. ఎంపి కవిత ఇంట్లో కూర్చుని పార్టీ నాయకులు తుల ఉమ, బాజిరెడ్డి గోవర్దన్, జీవన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులంతా కేసిఆర్ కు రాసిన ఉత్తరానికి బాధ్యులు. డిఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పుడతున్నారని, అందుకే వేటు వేయాలని వారంతా మూకుమ్మడిగా కేసిఆర్ కు అల్టిమేటం జారీ చేసేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా డిఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటే? ఏరకమైన కార్యకలాపాలు అన్నది చర్చనీయాంశమైంది. టిఆర్ఎస్ లో ఉంటూనే టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా డిఎస్ పనిచేస్తున్నారన్నది ఎంపి కవిత నాయకత్వంలోని బృందం ఆరోపణ. మరి డిఎస్ అలాంటి కార్యకలాపాలేమైనా చేశారా అన్నదానికి ఆధారాలు లేవు. డిఎస్ కొడుకు ధర్మపురి అర్వింద్ బిజెపిలో యాక్టీవ్ గా పనిచేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపి సీటులో అర్వింద్ పోటీ చేస్తారన్న ప్రచారం ఉంది. అందుకే డిఎస్ తన కొడుకును బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నది కవిత వర్గం ఆరోపణ. వేటు వేయాలని కోరేది కూడా ఈ కారణంగానే.
మరి ఈ విషయాన్ని కొద్దిగా పక్కనపెడితే ఇప్పుడు నిజామాబాద్ కాంగ్రెస్, టిఆర్ఎస్ వర్గాల్లో సాగుతున్న చర్చలేమిటో ఒకసారి చూద్దాం. రానున్న ఎన్నికల్లో ఎంపి కవిత జగిత్యాల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని బాగా ప్రచారం సాగుతోంది. జగిత్యాలలో పోటీ చేయడమంటే సింహం మీద దండయాత్ర చేయడమే అన్నది కవితకు కూడా అర్థమైంది. ఎందుకంటే జగిత్యాలలో పక్కా మాస్ లీడర్, ప్రొఫెషనల్ పొలిటీషియన్ తాడిపర్తి జీవన్ రెడ్డి రంగంలో ఉన్నారు. ఆయనను ఢీకొట్టి గెలవడం అంటే సర్వశక్తులు ఒడ్డాలన్న విషయం కూడా కవితకు తెలుసు. అందుకే కవిత ఒక పద్ధతి ప్రకారం నిజామాబాద్, జగిత్యాల పాలిటిక్స్ నడుపుతున్నారని చెబుతున్నారు. నిజామాబాద్ ఎంపిగా తన భర్త అనీల్ రావును బరిలోకి దించాలన్న ఆలోచనలో ఎంపి కవిత ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం నిజామాబాద్ ఎంపిగా తాను పోటీ చేయకపోతే ఇక్కడ డిఎస్ చక్రం తిప్పే అవకాశం ఉంటుందని ఆమె ఆందోళన చెందుతున్నారు. అందుకోసమే తాను జగిత్యాలలో పోటీ చేయాలన్నా, తన భర్తను నిజామాబాద్ ఎంపిగా బరిలోకి దింపాలన్నా.. మాస్టర్ ప్లాన్ వేయాల్సిందే అని కవిత అంచనాకొచ్చారు. దానిలో భాగమే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా డిఎస్ మీద ఆరోపణలు గుప్పించి పార్టీ నుంచి బయటకు పంపితే ఇటు నిజామాబాద్ తనదే అవుతుంది, జగిత్యాల తనకే ఉంటుంది అన్న ఆలోచనతోనే డిఎస్ పై వార్ షురూ చేశారని అంటున్నారు. ఈ తరుణంలోనే డిఎస్ మీద ఆరోపణల వర్షం కురిపిస్తూ కేసిఆర్ కు కవిత లేఖ రాయించారని టాక్. తన ఇంట్లోంచే ఆమె లేఖ రాయించారంటే కేవలం తన ఉద్దేశం మేరకే మిగతావారంతా సంతకాలు చేశారని చెబుతున్నారు. అసలే కేసిఆర్ కుమార్తె.. ఆమె సంతకాలు పెట్టమంటే పెట్టకుండా మిగతావారు ఉంటారా?
మరి కవిత అనుకున్నదే తడవుగా యాక్షన్ ప్లాన్ అమలు చేశారు. ఆమె యాక్షన్ ప్లాన్ కేసిఆర్ ను ఇరకాటంలోకి నెట్టిందనే చెప్పవచ్చు. ఎందుకంటే స్వయాన తన కుమార్తె సీరియస్ ఆరోపణలు గుప్పిస్తూ లేఖ రాసిందంటే అది ఎంత పెద్ద విషయమో కేసిఆర్ కు తెలియదా? కానీ కవిత నాయకత్వంలోని బృందం రాసిన లేఖను కేసిఆర్ లైట్ తీసుకున్నారు. దానికి కారణం డిఎస్ కు తనకు ఉన్న స్నేహమే. రాజకీయాల్లోకి వచ్చిన నాటినుంచి డిఎస్ కు కేసిఆర్ కు మధ్య మంచి స్నేహం ఉంది. అందుకే డిఎస్ కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి రాగానే సలహాదారు పదవి కట్టబెట్టారు. తర్వాత రాజ్యసభకు పంపించారు. ఇటు చూస్తే కూతరు, అటు చూస్తే స్నేహితుడు.. ఎవరి మాట వినాలన్నదానిపై కేసిఆర్ డైలమాలో పడ్డారు. అందుకే కేసిఆర్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. నిజానికి కేసిఆర్ స్వభావం తెలిసిన వారంతా డిఎస్ మీద వేటు పడుతుందని ప్రచారం చేశారు. గతంలో కేసిఆర్ అనుకుండంటే నిర్ణయం జరిగిపోయింది. మొన్నటికి మొన్న ఉపముఖ్యమంత్రి రాజయ్యను క్షణాల మీద బర్తరఫ్ చేసి పక్కన పడేశారు. తెలంగాణలో బలమైన సామాజికవర్గానికి చెందిన రాజయ్య మీద వేటు వేయాలంటే ఎంతో సాహసం కావాలి. అయినా కేసిఆర్ దేనికీ భయపడకుండా రాజయ్య మీద వేటు వేశారు.
అంతకుముందు దివంగత నేత టైగర్ నరేంద్ర మీద వేటు వేశారు. సినీ నటి విజయశాంతిపై వేటు వేశారు. వైఎస్ బతికున్న కాలంలో అసమ్మతి ఎమ్మెల్యేల మీద వేటు వేశారు. మరి అంతటి సాహసుడైన కేసిఆర్ కు డిఎస్ మీద వేటు వేయడం పెద్ద పని కూడా కాదు. ఎందుకు వేటు వేయడంలేదంటే డిఎస్ తో ఉన్న స్నేహం ఒక కారణమైతే.. కవిత టీం చేస్తున్న ఆరోపణల్లో పస లేదన్న ఉద్దేశంలో కేసిఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. నిజామాబాద్ ఎంపి సీటుకు కవిత తన భర్తను నిలబెట్టాలన్న ఉద్దేశంతోనే డిఎస్ మీద ఆరోపణలు గుప్పించారన్న విషయం కేసిఆర్ కు తెలిసిందని, అందుకే ఏ నిర్ణయమూ తీసుకోలేదని చెబుతున్నారు.
నిజంగా డిఎస్ మీద వేటు వేయించాలనుకుంటే కవితకు చిటికె వేసినంత పని కూడా కాదు. ఎందుకంటే ఆమె కేసిఆర్ కూతురు. ఏదో ఒక సందర్భంలో డిఎస్ ను పార్టీలోంచి తొలగించండి అని ఒక్క మాట చెప్పినా కేసిఆర్ ఏదో ఒక సాకు చూసి వేటు వేసే చాన్స్ ఉంది. కానీ చిటికెలో పోయేదాన్ని కవిత ఇంత పెద్ద రాద్దాంతం ఎందుకు చేశారన్న చర్చ కూడా నిజామాబాద్ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. గోరుతో పోయేదానికి గొడ్డలిని వాడటం ఎందుకబ్బా అనుకుంటున్నారు. అయితే కవిత ఈ విషయంలో వ్యూహాత్మకంగానే వ్యవహరించారని చెబుతున్నారు. తొలిదశలో డిఎస్ ను సాగనంపాలని కేసిఆర్ కు సూచించారని, అయినా తనకున్న స్నేహం కారణంగా కేసిఆర్ పట్టించుకోలేదని అంటున్నారు. అందుకోసమే డిఎస్ ను బదనాం చేసే పనిలో కవిత అండ్ టీం ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. దానిలోభాగంగానే గతంలో ఎమ్మెల్సీ భూపతిరెడ్డి ని కూడా ఈ తరహాలోనే బదనాం చేసే కార్యక్రమాలు చేశారని నిజామాబాద్ కు చెందిన డిఎస్ ముఖ్య అనుచరుడు ఒకరు తెలిపారు. బదనాం చేసిన తర్వాత డిఎస్ అయినా, భూపతిరెడ్డి అయినా టిఆర్ఎస్ లో వీక్ అయిపోతారని, తద్వారా రానున్న ఎన్నికల్లో తన టార్గెట్ రీచ్ కావొచ్చని కవిత ప్లాన్ గా చెబుతున్నారు. మరి ఈ నిజామాబాద్ రాజకీయం మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.