దేశ ప్రజల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలులోకి తీసుకువచ్చి ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తోంది. ఈ క్రమంలో దేశంలోని ఆడపిల్లల బంగారు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం వారికోసం ఐదు రకాల ప్రత్యేక పథకాలను అమలులోకి తీసుకువచ్చింది. ఈ ఐదు రకాల స్కీములు ప్రవేశపెట్టడం వల్ల ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తు కోసం భయపడాల్సిన అవసరం లేదు. ఆడపిల్లల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆ ఐదు పథకాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సుకన్య సమృద్ధి యోజన పథకం:
ఆడపిల్లలు కన్న తల్లి తండ్రులు వారి ఉన్నత విద్య, పెళ్లి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ముందు నుంచే పొదుపు చేయడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ లో మీ పిల్లల పేరు మీద సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయాలి. ఈ స్కీం కేవలం అమ్మాయిలకు మాత్రమే వర్తిస్తుంది. అమ్మాయి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు అమ్మాయికి 10 ఏళ్ల వయస్సు వచ్చే వరకు అకౌంట్ మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ఇక అమ్మాయికి 21 ఏళ్లు వచ్చిన తర్వాత డబ్బులు విత్‌డ్రా చేయొచ్చు.సుకన్య సమృద్ధి యోజన అకౌంట్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250 నుంచి గరిష్టంగా రూ.1,50,000 వరకు డిపాజిట్ చేయొచ్చు.
నేషనల్ స్కీమ్ ఆఫ్ ఇన్సెంటివ్ టు గర్ల్స్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్:
ఈ స్కీం లో ఆడపిల్లల పేరు మీద మూడు వేల రూపాయలని ఫిక్సెడ్ డిపాజిట్ చేయవచ్చు. ఇక ఆడపిల్లకి పద్దెనిమిది ఏళ్ళు వచ్చాక ఈ డబ్బులని విత్ డ్రా చేసి తీసుకోవచ్చు.
బాలిక సమృద్ధి యోజన పథకం:
ఆడపిల్లల భవిష్యత్తు కోసం 1997 అక్టోబర్ 2న బాలికా సమృద్ధి యోజన పథకాన్ని కేంద్రం తీసుకు వచ్చింది.ఈ స్కీం ద్వారా ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి 18 సంవత్సరాలలోపు ఆమె చదువుకు అయ్యే మొత్తం ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. 15 ఆగస్టు 1997 తర్వాత పుట్టిన ఆడపిల్లలకి ఈ స్కీము వర్తిస్తుంది.
బేటి బచావో బేటి పడావో:
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బేటి బచావో బేటి పడావో స్కీం ముఖ్య లక్ష్యం ఆడపిల్లను రక్షించి వారిని చదివించడం. బాలిక వధ ని అరికడుతు ఆడపిల్లలకు చదువు చెప్పటానికి 100 కోట్ల నిధులతో ఈ స్కీమ్ ని కేంద్రం తీసుకు వచ్చింది.
CBSE ఉదాన్ స్కీమ్:
సీబీఎస్ఈ ఎఫిలియేటెడ్ స్కూల్స్ లో చదువుతున్న ఆడపిల్లలకి ముఖ్యంగా వెనుకబడిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్కీం వర్తిస్తుంది. 11, 12వ తరగతిలో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ స్ట్రీమ్ లో ఉన్న వాళ్ళకి ఈ ప్రయోజనం కలుగుతుంది. అయితే ఈ స్కీం బెనిఫిట్ ని పొందాలంటే ఆడపిల్లల తండ్రి ఆదాయం ఆరు లక్షల దాటి ఉండకూడదు.