క్రెడిట్ కార్డ్ వినియోగదారులు వారికి తెలియకుండానే ఎన్ని ఛార్జీలు కడుతున్నారో తెలుసా?

RBI brings new rules on debit and credit card transactions

ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డు వినియోగదారుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. బ్యాంకులు కూడా క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ఇప్పటికే ఎన్నో ఆఫర్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. వినియోగదారుల అవసరాలను బట్టి కొత్త కొత్త ఆఫర్లను కూడా అందుబాటులోకి తెస్తుంది. ఈ క్రెడిట్ కార్డుల ద్వారా ప్రజలకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఏదైనా కొనుగోలు చేస్తే బ్యాంకును బట్టి దాదాపు నెల తర్వాత తిరిగి చెల్లించే సౌలభ్యం ఉంది. అంతే కాకుండా రివార్డ్ పాయింట్‌లు, డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ వంటి అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

అయితే క్రెడిట్ కార్డ్ ఉపయోగించే వారు వారికి తెలియకుండానే ప్రతి యేటా కొంత రుసుము చెల్లిస్తున్నారు. ఆ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

• జాయినింగ్ & రెన్యువల్ ఛార్జీలు : క్రెడిట్ కార్డ్ కార్డ్ తీసుకున్నపుడు కొంత మొత్తంలో జాయినింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇది ఒకసారి మాత్రమే చెల్లిస్తారు. అలాగే ప్రతి సంవత్సరం క్రెడిట్ కార్డ్ రెన్యువల్ కోసం తప్పనిసరిగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొన్ని బ్యాంకులు.. ఏడాదిలో నిర్ణీత మొత్తాన్ని ఖర్చు చేసినట్లయితే రెన్యువల్ ఫీజులో మినహాంపు ఇస్తున్నాయి.

• ఆలస్యానికీ రుసుము: ప్రతి నెలా నిర్దేశించిన తేదీలోపు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకపోతే దానికి అదనపు రుసుముతో పాటు వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది.

• ఉపసంహరణల రుసుము : క్రెడిట్ కార్డు వినియోగదారులు అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కోసం ఏటీఎం ద్వారా నగదు విత్‌ డ్రా చేసుకోనే అవకాశం ఉంటుంది. కానీ ఇలా క్రెడిట్ కార్డు నుండి ఏటీఎం ద్వారా డబ్బు డ్రా చేసుకున్న తర్వాత ఆ డబ్బులో దాదాపు 3 శాతం ఛార్జీలుగా చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాకుండా నిర్ణీత గడువు తేదీ కన్న ముందుగా నిర్ణయించిన పరిమితిని మించి ఎక్కువ ఖర్చు చేసినా కూడా అదనపు ఛార్జీలు చెల్లించక తప్పదు.

• విదేశీ లావాదేవీలపై రుసుము : క్రెడిట్ కార్డ్ వినియోగదారులు కొన్ని సందర్భాలలో ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా విదేశీ లావాదేవీల కోసం క్రెడిట్‌ కార్డును వినియోగిస్తు ఉంటారు. అలాంటి సమయంలో బ్యాంకులకు 4 శాతం వరకు అదనపు రుసుము చెల్లించాలి. అయితే ఈ రుసుము చెల్లించకుండా ఉండాలంటే ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డులను ఎంచుకోవాలి.