ఐపీఎల్‌ 2020: ఏంటి కోహ్లి.. ఇలా అయితే ఎలా?

దుబాయ్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-2020లో తొలి శతకం నమోదయింది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ సారథి కేఎల్‌ రాహుల్‌ (132; 69 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లు) శతక్కొట్టాడు. 66 బంతుల్లోనే శతకం బాదిన రాహుల్‌ ఈ సీజన్‌లో శతకం బాదిన తొలి బ్యాట్స్‌మెన్‌గా ఘనతను అందుకున్నాడు. అయితే రాహుల్‌ జోరుకు ఆర్సీబీ చెత్త ఫీల్డింగ్‌ కూడా కలిసొచ్చింది. ముఖ్యంగా రాహుల్‌ శతకానికి ముందు ఇచ్చిన రెండు సులువైన క్యాచ్‌లను ఆర్సీబీ సారథి, ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఫీల్డర్లలో ఒక్కరిగా పేరు గాంచిన విరాట్‌ కోహ్లి నేలపాలు చేశాడు.
రాహుల్‌ 83 పరుగుల వద్ద డెల్‌ స్టెయిన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించాడు. స్టెయిన్‌ వేసిన ఫుల్‌ టాస్‌ను భారీ షాట్‌ ఆడాడు. కానీ షాట్‌ మిస్సయి బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న కోహ్లి చేతుల్లోకి వెళ్లింది. అయితే అది పెద్ద కష్టమైన క్యాచ్‌ కాకున్నా.. ఆ క్యాచ్‌ను వదిలేదు. అనంతరం 89 పరుగుల వద్ద కేఎల్‌ రాహుల్‌కు మరోసారి కోహ్లి లైఫ్‌ ఇచ్చాడు. నవదీప్‌ సైనీ బౌలింగ్‌లో లాంగాఫ్‌ దిశగా భారీ షాట్‌ ఆడేందకు యత్నించిన రాహుల్‌ బంతిని గాల్లోకి లేపాడు. అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న కోహ్లి కొద్ది దూరం పరిగెత్తుకుంటూ వెల్లి సులువైన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. వరుసగా రెండు క్యాచ్‌లు నేలపాలు చేయడం పట్ల తొలుత నవ్వుకున్నా ఆతర్వాత తనపై తనే అసహనం వ్యక్తం చేసుకున్నాడు.

ఇక కోహ్లి రూపంలో వచ్చిన రెండు అదృష్టాలను అందిపుచ్చుకున్న రాహుల్‌ శతకం పూర్తి చేశాడు. అయితే బెస్ట్‌ ఫీల్డర్లలో ఒకడైన కోహ్లి ఇలా రెండు సులువైన క్యాచ్‌లు వదిలేయడంపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా కోహ్లి కూడా ఫిట్‌నెస్‌ కోల్పోయాడని, ఆటలో మళ్లీ మొదటికి వచ్చాడాని విమర్శిస్తున్నారు. ఇక రాహుల్‌ శతకం సాధించడంతో ఆర్సీబీకి కింగ్స్‌ పంజాబ్‌ 207 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేంశించింది.