ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 13 చెన్నై సూపర్ కింగ్స్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. టోర్నీ ప్రారంభానికి ముందు ఇద్దరు ఆటగాళ్లు దూరం కావడం, వరుస ఓటములు ధోని సేనను కుంగదీస్తున్నాయి. ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)తో గెలిచే మ్యాచ్‌ను సీఎస్‌కే చేజార్చుకోవడంతో ఆ జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా కేదార్ జాదవ్ చెత్త బ్యాటింగ్, ధోని వైఫల్యంపై అభిమానుల నుంచి ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. విమర్శలు, ట్రోలింగ్ చేయడం వరకు బాగానే ఉంది. కానీ ఆటగాడిని వ్యక్తిగతంగా తిట్టడం, బెదిరింపులకు దిగడం విస్మయానికి గురిచేస్తోంది.
ఈ క్రమంలో కొందరు అభిమానులు హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. తాము కూడా మనుషులమని, సమాజంలోనే జీవిస్తున్నామనే కనీస సోయి లేకుండా మాట్లాడుతున్నారు. ఎంఎస్ ధోని ఆరేళ్ల కూతురు జీవాను ఈ విషయంలోకి అనవసరంగా తీసుకొచ్చి విషం చిమ్ముతున్నారు. ఈ సీజన్‌లోని మిగతా మ్యాచ్‌ల్లో ధోని మంచిగా ఆడకపోతే అతడి కూతురు జీవాపై అత్యాచారం చేసేందుకు వెనుకాడమంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇలా కొందరు నెటిజన్లు దిగజారుడు వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపడుతున్నారు. ఆటపై, ఆటగాడిపై నిజమైన అభిమానుం ఉంటే ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేయరని కడిగిపడేస్తున్నారు. ఇక ఆట అన్నాక గెలుపోటములు సహజమని, గెలిచిప్పుడు దేవుడిగా, ఓడినప్పుడు రాక్షసుడిగా చిత్రీకరించడం భావ్యం కాదని నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు.
ఇక ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు అడిన సీఎస్‌కే కేవలం రెండిట్లో గెలిచి నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఆరంభపు మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసి గెలిచిన సీఎస్‌కే ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడింది. ఆ తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై సూపర్బ్ విక్టరీ అందుకొని ట్రాక్‌లోకి వచ్చిందనుకున్నారు. కానీ కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో చెత్త ప్రదర్శన చేసి మరోసారి ఘోరంగా నిరుత్సాహపరిచింది. ఈ క్రమంలో సీఎస్‌కే ఆటపై, ధోని పేలవ ఫామ్‌పై ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు.
https://twitter.com/VarunRDCR7/status/1314188103213613057?ref_src=twsrc%5Etfw