దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2020లో విరాట్ కోహ్లి సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘోర ఓటమిని మూటగట్టుకుంది. గురువారం దుబాయ్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 97 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న పంజాబ్ ఈ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ పంజాబ్ 207 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఛేదనలో ఆర్సీబీ బ్యాట్స్‌మన్ చేతులెత్తేశారు. ఒక్కరంటూ ఒక్కరు కూడా బాధ్యతా యుతంగా ఆడలేదు. పంజాబ్ బౌలర్ల ధాటికి 17 ఓవర్లలో 109 పరుగులకే కోహ్లి సేన కుప్పకూలిపోయింది. వాషింగ్టన్ సుందర్(30), డివిలియర్స్(28) మినహా ఏ ఒక్క బ్యాట్స్‌మన్ కూడా కనీస పోరాట పటిమను ప్రదర్శించలేదు. కోహ్లి(1) ఘోరంగా విఫలం కాగా.. పడిక్కల్(1), ఫిలిప్(0), శివమ్ దూబె(12) తీవ్రంగా నిరాశపరిచారు. సెంచరీ హీరో కేఎల్ రాహుల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. సారథి కేఎల్ రాహుల్ (69 బంతుల్లో 132, 14 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆర్సీబీ చెత్తఫీల్డింగ్ కూడా రాహుల్‌కు కలిసొచ్చింది. ముఖ్యంగా కోహ్లి రెండు క్యాచ్‌లు నేలపాలు చేయడంతో రాహుల్ (83, 89)కు రెండ్ లైఫ్‌లు లభించాయి. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న రాహుల్ మరింత దూకుడుగా ఆడి సెంచరీ సాధించడంతో పాటు జట్టుకు భారీ స్కోర్‌ను అందించాడు. పంజాబ్ బ్యాట్స్‌మన్ జోరుకు స్టెయిన్ 4 ఓవర్లలో 57 పరుగులు సమర్పించుకున్నాడు.