ఆసీస్ బౌల‌ర్ల‌ని విసిగించిన భార‌త బ్యాట్స్‌మెన్స్.. సిడ్నీ టెస్ట్ డ్రా

సిడ్నీ వేదిక‌గా భార‌త్ – ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌రిగిన మూడో టెస్ట్ మ్యాచ్ మ‌స్త్ మ‌జాని అందించింది. ఒకానొక స‌మ‌యంలో భార‌త్ ఓడిపోతుందేమోన‌ని అనుకున్నారు. ఇంత‌లోనే పంత్ వన్డే త‌ర‌హాలో బ్యాటింగ్ చేస్తుండ‌డంతో భార‌త్ గెలుపు ప‌క్కా అని భావించారు. కాని అత‌ను ఔటైన కొద్ది సేప‌టికి పుజారా కూడా ఔట్ కావ‌డంతో టీమిండియా ఆశ‌లు ఆవిర‌య్యాయి. విహారి(23 నాటౌట్‌), అశ్విన్(39 నాటౌట్‌) ఫైటింగ్ ఇన్నింగ్స్ సిడ్నీ మ్యాచ్ డ్రా అయ్యేలా చేసింది.

407 పరుగుల లక్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ నాలుగో రోజు మంచి ఆరంభాన్నే ఇచ్చిన శుభ్‌మ‌న్ గిల్‌, రోహిత్ శ‌ర్మ వెంట‌వెంట‌నే ఔట్ కావ‌డంతో అంద‌రిలో భ‌యం మొద‌లైంది. ఈ మ్యాచ్ చేజారింద‌నే విశ్లేష‌కుల‌తో పాటు అభిమానులు భావించారు. ఐదో రోజు వ‌చ్చీ రాగానే కెప్టెన్ ర‌హానే (4) కూడా ఔట‌య్యాడు. ఈ ప‌రిస్థితుల్లో ఇండియా గెల‌వ‌క‌పోవ‌డం ప‌క్కా, ఓడిపోవ‌డం దాదాపు ఫిక్స్ అని డిసైడ్ అయ్యారు. కాని రిష‌బ్ పంత్(97) అటాకింగ్ ఇన్నింగ్స్‌కు తోడు.. పుజారా(77), విహారి , అశ్విన్‌ల అద్భుత బ్యాటింగ్ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఓ వైపు గాయంతో బాధ‌ప‌డుతూనే విహారి చివ‌రి వ‌ర‌కు క్రీజులో నిలిచి మ్యాచ్‌ను డ్రా చేశాడు.

విహారి, అశ్విన్ చివ‌రి సెష‌న్‌లో ఆసీస్ బౌల‌ర్ల‌ను ఎదుర్కొన్న తీరు మ్యాచ్‌కే హైలైట్ అని చెప్ప‌వ‌చ్చు. చివ‌రి సెష‌న్‌లో 36 ఓవ‌ర్ల పాటు ఆడి ఆసీస్ బౌల‌ర్స్‌కు విసుగు తెప్పించారు. బౌన్స‌ర్స్ వేసిన , స్లో బాల్స్ వేసి, గిర‌గిర తిరిగే బంతులు విసిరిన కూడా ఓపిక‌గా ఆడి చివ‌రి వ‌ర‌కు నిలిచారు. 1979 త‌ర్వాత టీమిండియా చివ‌రి ఇన్నింగ్స్‌లో ఇన్ని ఓవ‌ర్ల పాటు ఆడి మ్యాచ్‌ను డ్రాగా ముగించ‌డం ఇదే తొలిసారి. మూడో టెస్ట్ మ్యాచ్ డ్రా కావ‌డంతో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో 1-1తో రెండు టీమ్స్ స‌మ‌వుజ్జీలుగా ఉన్నాయి. ఈ మ్యాచ్ లో ఆసీస్ తొలి ఇన్నింగ్ 338 ప‌రుగులు చేయ‌గా, రెండో ఇన్నింగ్స్ 6 వికెట్ల న‌ష్టానికి డిక్లేర్ చేసింది. ఇక భార‌త్ తొలి ఇన్నింగ్స్‌లో 244 ప‌రుగులు చేయ‌గా, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల‌కు 334 ప‌రుగులు చేసింది.