దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ 13లో చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్‌కే) బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. సురేశ్ రైనా వ్యక్తిగత కారణాలతో ఈ టోర్నీకి దూరం కావడంతో ఆ లోటును పూడ్చే బాధ్యతను జాదవ్ తీసుకుంటాడని అందరూ భావించారు. కానీ సీఎస్‌కే ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఈ రైట్‌హ్యాండ్ బ్యాట్స్‌మన్ ఒక్క చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్, జట్టును నిలబెట్టే ఆట ఆడలేదు.
ఓ వైపు డుప్లెసిస్ ఒంటరి పోరాటం చేస్తున్నప్పటికీ అతడికి కనీసం తనవంతు సహకారాన్ని అందించడం లేదు. దీంతో ఇంటాబయట జాదవ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్, విశ్లేషకుడు వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. ఓ ప్రముఖ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సీజన్‌లో సీఎస్‌కే ప్రదర్శన, ఇతరాత్ర అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్బ్ విక్టరీ అందుకున్న సీఎస్‌కే మంచి జోరు మీదుంది. అయితే ఈ సీజన్‌లో సీఎస్‌కే ఐదు మ్యాచ్‌లు ఆడింది. ఈ ఐదు మ్యాచ్‌ల్లో ధోని సేన ఎదుర్కొన్న ప్రధాన సమస్య.. ఫామ్‌లో ఉన్న డుప్లెసిస్‌కు తోడు లేకపోవడం. డుప్లెసిస్ ఒక్కడే గుర్రపు బండిని మోస్తున్నాడు. అతడికి మరొక సీఎస్‌కే బ్యాట్స్‌మన్ సహకారం అందించడం లేదు. రైనా లేకపోవడంతో అతడి లేని లోటును సీనియర్ ఆటగాడు కేదార్ జాదవ్ తీసుకుంటాడని భావించాం. అయితే అతడు తన ఆటతీరుతో తీవ్రంగా నిరాశపరిచాడు.
అతడి ఆటతీరు ‘గోధుమ పిండిలో ఒకరవ్వ’లా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ చేయడు.. ఇక ఫీల్డింగూ అంతంతే. రూ.8 కోట్లు వెచ్చించి తీసుకున్న ఆటగాడు అలంకార ప్రాయంగా ఉండటం నచ్చలేదు. ఈ విషయంపై ధోని ఓ సారి ఆలోచించుకోవాలి. ఇక సీఎస్‌కే బౌలింగ్ ట్రాక్‌లోనే ఉంది. ఫిట్‌నెస్ సాధించి జట్టులోకి పునరాగమనం చేసిన బ్రావో ఇంకా గాడిలో పడలేదు. ఇక కేకేఆర్ టీంలో మంచి ఆటగాళ్లు ఉన్నారు. వారందరిని సరిగ్గా ఉపయోగించుకుంటే జట్టును విజయాల బాట పట్టించడంతో పాటు సారథిగా దినేశ్ కార్తీక్ విజయంతం అవుతాడు.